పార్వతీ పరమేశ్వరులకు లక్ష పుష్పార్చన

నార్కట్‌పల్లి, జనవరి 13 : అమావాస్య సందర్భంగా చెర్వుగట్టులోని పార్వతీ పరమేశ్వరులకు బుధవారం లక్ష పుష్పార్చన ఘనంగా జరిపించారు. అనంతరం గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగించుకుంటూ కోనేరు వద్దకు తీసుకెళ్లి పంచహారతిని సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ చైర్మన్ మేకల అరుణారాజిరెడ్డి, ఈఓ సులోచన అన్ని వసతులను కల్పించారు. కార్యక్రమంలో ఆలయాభివృద్ధి కమిటీ సభ్యులు బూరుగు కృష్ణయ్య, కొండేటి వేణు, మారుపాక ప్రభాకర్‌రెడ్డి, కంకల యాదయ్య, వంపు శివశంకర్, పసునూరి శ్రీనివాస్, చిక్కుళ్ల యాదగిరి, కల్లూరి శ్రీను, దండు శంకరయ్య, బొబ్బలి దేవేందర్, రాధారపు భిక్షపతి, మేక వెంకట్‌రెడ్డి, చీర మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
గుట్టపైకి అమ్మవారు
బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 19న ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆనవాయితీ ప్రకారం భోగి పండుగను పురస్కరించుకొని అమ్మవారిని బుధవారం గుట్టపైకి పల్లకీ సేవతో తీసుకెళ్లారు. ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ పాలకమండలి సభ్యులు పల్లకీని గుట్టపైకి మోసుకొని వెళ్లారు.
భక్త జనసంద్రం...
చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం బుధవారం భక్తులతో కిక్కిరిసింది. భోగి పర్వదినంతోపాటు అమావాస్య కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గుట్టపై నిద్రచేసే భక్తులు ఓం నమశ్శివాయ నామాన్ని జపించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కటుంబ సభ్యులు పూజలు చేశారు.