శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Nalgonda - Aug 08, 2020 , 00:25:20

వరుసగా ఐదో ఏడాదీ..

వరుసగా ఐదో ఏడాదీ..

  • l   సాగర్‌ ఎడమకాల్వకు నీటి విడుదల 
  • l    శ్రీశైలం నుంచి కొనసాగుతున్న ఇన్‌ ఫ్లో
  • l   గత చరిత్రను తిరగరాస్తూ ప్రభుత్వ నిర్ణయం

నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీపి కబురందించారు. ఎవ్వరూ ఊహించని విధంగా సాగర్‌ ఎడమకాల్వకు సాయంత్రానికే సాగునీటిని విడుదల చేయాలని శుక్రవారం ఉదయం ఆదేశించారు. వెనువెంటనే స్పందించిన అధికారులు ఆ దిశగా  ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఐదు గంటలకు స్థానిక ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య పొట్టిచెల్మ వద్ద కృష్ణమ్మకు సారె సమర్పించి, జలహారతిచ్చి లాంఛనంగా నీటిని విడుదల చేశారు. ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో 90రోజుల పాటు నీటి విడుదల కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు. ‘ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి తాగు, సాగు నీటి అవసరాలకు ఏ విధంగా ఉపయోగించాలో సీఎం కేసీఆర్‌కు తెలుసునని, నీటి వినియోగంపై ప్రత్యేక ప్రణాళికలతో రాష్ర్టాన్ని ముందుకు తీసుకుపోతున్నారు’ అని ఈ సందర్భంగా నోముల పేర్కొన్నారు. వరుసగా ఐదో ఏడాది సైతం నీటిని విడుదల చేయడం పట్ల ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో గత నెల 14వ తేదీ నుంచే శ్రీశైలానికి ఎగువ ప్రాజెక్టు నుంచి వరదనీరు వచ్చి చేరుతోంది. సాధారణంగా శ్రీశైలం ప్రాజెక్టు నిండడానికి రెండు, మూడు రోజుల ముందుగా విద్యుత్తు ఉత్పత్తిని చేస్తూ సాగర్‌కు నీటిని విడుదల చేస్తుంటారు. కానీ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అప్రమత్తమైంది. శ్రీశైలానికి వరద మొదలైన రెండో రోజు నుంచే రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉండే ఎడమ గట్టు విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ద్వారా ఉత్పత్తిని ప్రారంభించింది. తద్వారా నాగార్జునసాగర్‌లోకి ఈ సారి ముందుగానే వరదనీరు చేరేందుకు అస్కారం ఏర్పడింది. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసినా సరే.. రాష్ట్ర ప్రభుత్వం వెనక్కితగ్గలేదు. ఇరు రాష్ర్టాలకు ఉపయుక్తమైన సాగర్‌లో నీటిని నిల్వ చేయాలని భావించింది. తద్వారా ఆయకట్టు రైతాంగానికి లబ్ధి చేకూర్చాలన్న పట్టుదలను కనబర్చింది. ఫలితంగానే ఇప్పుడు ఎడమకాల్వ ఆయకట్టుకు నీటి విడుదలకు అవకాశం లభించింది. అయితే ఈ ఏడాది సాగర్‌లో కనిష్ఠ నీటిమట్టం 529.10 అడుగులుగా నీటి నిల్వ సామర్థ్యం 167 టీఎంసీలు ఉన్నది. ప్రభుత్వం ముందుచూపుతో శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో సాగర్‌లో గత 20 రోజుల్లో 27 అడుగుల అదనపు నీటిమట్టంతో 60 టీఎంసీల నీరు ముందుగానే సాగర్‌కు చేరుకుంది. శుక్రవారం సాయంత్రానికి నాగార్జునసాగర్‌లో 557.10 అడుగుల నీటిమట్టం నమోదైంది. 227.70 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లోగా 38,140 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. గత ఏడాది ఇదే సమయానికి సాగర్‌లో 507 అడుగుల నీటిమట్టంలో 126.60 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నది. అయితే నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వారం రోజులుగా పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ వస్తోంది. ఒకసారి నీటి విడుదల చేస్తే పంట చివరి వరకు ఆగకుండా చూడాలని భావించారు. అందుకే శ్రీశైలం నుంచి విద్యుత్తు ఉత్పత్తి ద్వారా నీటిని విడుదల చేస్తూ సాగర్‌లో నిల్వ చేస్తూ వచ్చారు. దీనికి తోడు ఆల్మట్టి ఎగువన కూడా రెండు రోజులుగా భారీ వర్షాలు కరుస్తుండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో సాగునీటిని విడుదల చేశారు. 

ఈ నీటితో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని 6.30లక్షల ఎకరాలకు ఆన్‌అండ్‌ ఆఫ్‌ పద్ధ్దతిలో సాగునీరు అందనుంది. గతేడాది కూడా రెండు పంటలకు సమృద్ధిగా నీటిని విడుదల చేశారు. ఈ వానకాలం సీజన్లలో పంట పూర్తయ్యే నాటికి 90 టీఎంసీల నీరు అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే రైతాంగం చాలావరకు నార్లుపోసుకుని సిద్ధ్దంగా ఉన్నారు. ప్రస్తుతం విడుదల చేసిన నీటితో నాట్లు ప్రారంభించనున్నారు. తొలిదశలో 25 రోజుల పాటు ఎడమకాల్వకు నీటిని విడుదల చేసి,ఆ తర్వాత కొంత సమయం ఇచ్చి మళ్లీ నీటివిడుదల కొనసాగనుంది. అయితే గతేడాది ఆగస్టు 11వ తేదీన సాగునీటిని విడుదల చేశారు. ఆ తర్వాత నిరాటంకంగా నీటి విడుదల కొనసాగింది. చివరి భూములకు సైతం సాగునీరు అం దేలా చర్యలు తీసుకోవడంలో అధికారులు సఫలమయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 నుంచి నేటివరకు 2015 మినహా మొత్తం ఆరుసార్లు.. ఇది వరుసగా ఐదో సారి ఎడమకాల్వ ఆయకట్టుకు సాగు నీటిని విడుదల చేసినైట్లెంది. అప్పుడు సాగర్‌లో నీటినిల్వ విషయంలో ప్రభు త్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లేకుంటే మరికొంత కాలం సాగునీటి కోసం ఎదురుచూడాల్సి వచ్చేదన్న భావనలో రైతులు కనిపించారు. 



logo