సోమవారం 30 మార్చి 2020
Nalgonda - Feb 20, 2020 , 02:33:28

పన్నులు చెల్లించకపోతే చర్యలు...

పన్నులు చెల్లించకపోతే చర్యలు...


పంచాయతీల్లో ఇంటి యజమానులు పన్ను చెల్లించకుంటే కొంత వెసులుబాటు కల్పించనున్నా ట్రేడ్‌ లైసెన్స్‌దారులు, నాన్‌టాక్స్‌ పరిధిలోకి వచ్చే వారిపై చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే నాంపల్లిలో ఓ రైస్‌ మిల్లు యజమాని పన్ను చెల్లించకపోతే ఆ రైస్‌ మిల్లును పంచాయతీ శాఖ యంత్రాంగం సీజ్‌ చేసింది. ఇక ట్రేడ్‌ లైసెన్స్‌ కింద పన్నులు చెల్లించే వారి లైసెన్స్‌లు సైతం రద్దు చేయనున్నారు. అదేవిధంగా జీపీల్లో చేపల చెరువులు, సంతలు, దేవాలయాల్లో కొబ్బరికాయల వేలం పాటలు, ఇతర వేలానికి సంబంధించి రాశాల్సిన పన్నుల విషయంలోనూ నిర్లక్ష్యం వహిస్తే కేసులు నమోదు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం పన్నుల వసూళ్లను ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తుండటంతో స్థానిక సిబ్బందిపై ఒత్తిడి పెరిగి వసూళ్లపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. గతేడాది స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 71 శాతం పన్నులు వసూలు కాగా ఈసారి పూర్తిస్థాయిలో చేసేలా ప్రణాళికలు రూపొందించారు. 


నీలగిరి : పల్లెల్లో గుణాత్మక మార్పు తీసుకురావడం కోసమే సీఎం కేసీఆర్‌ పంచాయతీరాజ్‌ చట్టాన్ని రూపొందించి పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం వ్యవసాయ మార్కెట్‌లో పంచాయతీరాజ్‌ సమ్మేళన కార్యక్రమాన్ని జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాకముందు సీమాంధ్ర పాలనలో ఆకలిచావులు, కటికచీకట్లు, బీడు భూములే కనపడేవని ఇప్పుడు ఆకలిచావులు లేవు, సంక్షేమ రంగంలో 50వేల కోట్లు ఖర్చుపెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఇతరదేశాలు, రాష్ర్టాల గురించి మాట్లాడటం గాకుండా మన రాష్ట్రం గురించి ఇతరులు మాట్లాడేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పల్లెల సమగ్రాభివృద్ధికి పల్లెప్రగతి కార్యక్రమాన్ని రూపకల్పన చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం కావడంతో గ్రామప్రజల మధ్య ఐక్యత పెరిగిందన్నారు. ఇంకా నాలుగేళ్లు రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదని ప్రజలు ఏ నమ్మకంతో గెలిపించారు... గ్రామాల్లో ఇంకా చేయాల్సింది... ఇప్పటి వరకు జరిగిందేమిటి.. సమాజంలో చర్చించి ముందుకు పోవాలని మంత్రి అన్నారు. 


ప్రజల అపనమ్మకం, నైరాశ్యం పటాపంచలు చేస్తు తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్‌ అని నేడు అదే స్ఫూర్తితో గ్రామాలభివృద్ధికి ముందుకు సాగుతున్నారన్నారు. కార్యక్రమం ప్రారంభమైనప్పుడు కొంతమంది సర్పంచ్‌లు నిరాశతో ఉన్నారని ఈ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత పక్కగ్రామాల్లో గ్రామాల అభివృద్ధి, సర్పంచ్‌పై పెరుగుతున్న గౌరవంతో అందరు ముందుకువచ్చారన్నారు. రాజకీయాలకతీతంగా అందరు కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో మొట్టమొదటి విధి పారిశుధ్యంతో మొదలు పచ్చదనం కూడా ముఖ్యమన్నారు. పరిసరాల కాలుష్యం నివారించాలంటే చెట్టు నుంచి వచ్చే ఆక్సిజన్‌ ముఖ్యమన్ని దీన్ని గుర్తించిన కేసీఆర్‌ 230కోట్ల మొక్కలను హరితహారం కార్యక్రమంలో నాటాలని ఉద్యమంగా చేపట్టారన్నారు. గ్రామ పంచాయతీలలో మొక్కలు నాటేందుకు ప్రతి గ్రామంలో ఒక నర్సరీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. గత చరిత్రలో ఎన్నడు లేనివిధంగా నల్లగొండ జిల్లాలో పల్లె ప్రగతిలో భాగంగా ప్రతినెల 20కోట్ల చొప్పున అయిదు నెలల్లో వందకోట్ల నిధులు కేటాయించారన్నారు. మంచి ప్రగతి సాధించిన గ్రామాలకు ఇంటెన్సివ్‌గా రూ.8 కోట్లు వచ్చాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్‌మోడల్‌గా ఉందన్నారు.  త్వరలో పట్టణాల్లో చేపట్టబోయే పట్టణ ప్రణాళికను కూడా స్థానిక కౌన్సిలర్లు, అధికారులు, ప్రజలు అందరు మమేకమై చేయి చేయి కలిపి వార్డులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవాలి. ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, ఐసీడీఎస్‌ రీజనల్‌ ఆర్గనైజర్‌ మాలే శరణ్యారెడ్డి, అదనపు కలెక్టర్లు వనమాల చంద్రశేఖర్‌, రాహుల్‌శర్మ, జడ్పీవైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు, జడ్పీ సీఈవో సీతాకుమారి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తాసిల్దార్‌ నాగార్జునరెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. 


ఎమ్మెల్యేలు కంచర్ల, కోమటిరెడ్డి మధ్య వాగ్వాదం

ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల మధ్య వాగ్వివాదం జరిగింది. రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని గ్రామాల అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అనంతరం భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో సీఎం కేసీఆర్‌ ముందుకు తీసుకెళుతూ లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. ఎక్కడ కేటాయిస్తున్నారో చెప్పాలని రాజగోపాల్‌రెడ్డి అనడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో అక్కడే ఉన్న  ఇరు వర్గాల కార్యకర్తలు స్టేజి పైకి రావడంతో ఉద్రికత్త నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. 


ప్రజల భాగస్వామ్యం ఘనత కేసీఆర్‌దే..

- బడుగుల లింగయ్యయాదవ్‌, రాజ్యసభ సభ్యుడు

గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారు. పల్లెలు బాగుపడాలని అందర్ని భాగస్వామ్యం చేస్తు పల్లెప్రగతిని చేపట్టారు. సర్పంచ్‌లు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు చేసి ఇతర రాష్ర్టాల ప్రజాప్రతినిధులు ఆశ్చర్యపోతున్నారు. వినూత్నమైన పల్లె ప్రగతితో రాష్ట్రం సమగ్రాబివృద్ధి సాధ్యమవుతుంది. 


logo