సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 29 : తన స్వార్థం కోసం మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి వేల కోట్ల కాంట్రాక్టులు తెచ్చుకున్న దొంగ రాజగోపాల్‌రెడ్డి అని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం సంస్థాన్ నారాయణపురం మండలం పొర్లగడ్డతండా పరిధి ఆంగోత్తండాలో మంత్రి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎక్కడైనా అనివార్య కారణాలతో ఉప ఎన్నికలు వస్తాయని, మునుగోడులో మాత్రం ఓ స్వార్థపరుడి రాజకీయ లబ్ధి కోసం వచ్చాయని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే.. ఎమ్మెల్యేగా ఉండి రాజగోపాల్‌రెడ్డి తండాల అభివృద్ధిని గాలికొదిలేశాడని మండిపడ్డారు. గిరిజనులు ఆత్మగౌరవంతో బతికే బిడ్డలని, రాజగోపాల్‌రెడ్డి, బీజేపీ కుయుక్తులను తిప్పికొడుతారని అన్నారు. తండాలను జీపీలుగా మార్చడమే కాకుండా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు.
అంతేకాకుండా గిరిజనుల ఆత్మగౌరవం ఉట్టిపడేలా హైదరాబాద్‌లో బంజారా భవన్ నిర్మించారని తెలిపారు. సీఎం కేసీఆర్‌పై ఇక్కడి ప్రజల ప్రేమ చూస్తుంటే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆయన గెలుపుతో తండాల రూపురేఖలు మారుతాయన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి తన బాధ్యత అని మంత్రి హామీ ఇచ్చారు. ప్రచారంలో వైస్ ఎంపీపీ రాజూనాయక్, మాజీ సర్పంచ్ బిచ్చునాయక్, కుమార్, బిచ్చానాయక్, రాజూనాయక్, కార్తీక్నాయక్, కిషన్, మోహన్, భాను, దూద్యా, దశరథ్, హారిక, రాజేశ్‌నాయక్, సోని పాల్గొన్నారు.