నల్లగొండ, జూలై 28: కాల్వ నీళ్లు రానేలేదు…సమృద్ధిగా వానలు కురవనేలేదు..ఫలితంగా జిల్లాలో ప్రస్తుత వానకాలం సీజన్లో 11.60 లక్షల ఎకరాల సాగు అంచనాకు గానూ ఇప్పటివరకు సాగైంది 5.70లక్షల ఎకరాలే. ఇది కూడా పంట ఆరంభ దశలోనే ఉండటంతో పెద్దగా యూరి యా అవసరం పడలేదు. అయినా జిల్లాలో ఇప్పటికే యూ రియా కొరత రైతులను వేధిస్తోంది. జిల్లాలో ఈ సీజన్‌కు 1.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉం డగా ప్రభుత్వం మాత్రం 70 వేల మెట్రిక్ టన్నులనే కేటాయించింది.
అందులోనూ ఇప్పటి వరకు 25 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే రాగా మరో 35 వేల టన్నులు రావాల్సి ఉంది. ఇప్పుడే యూరియా కొరత జిల్లాలోని రైతులను కలవర పెడుతుంటే సాగర్ కెనాల్ నీళ్లు విడుదలై పొలాల్లో నాట్లు పడ్డాక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతోంది. ప్రస్తుతం జిల్లాలో 9 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉండగా అందులో 7500 మెట్రిక్ టన్నులు ప్రైవేటు దుకాణాల్లో ఉండగా మార్క్‌ఫెడ్ వద్ద 1590 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. మార్క్‌ఫెడ్ యంత్రాం గం మాత్రం పీఏసీఎస్, ఏఆర్ఎస్కేలకు మాత్రమే యూరియా ఇస్తూ ఎన్డీసీఎమ్మెఎస్, ఎఫ్‌పీవోలకు మాత్రం కట్ చేయటం విశేషం.
యూరియా కట్ చేసిన మార్క్‌ఫెడ్..
ప్రభుత్వం కేటాయించిన యూరియాలో వచ్చిన రాక్స్ 60 శాతం మార్క్‌ఫెడ్‌కు ఇవ్వగా 40 శా తం హోల్ సేల్ డీలర్లు ఇస్తారు. హోల్‌సేల్ డీలర్లు స్టాక్‌లో కొంత రిటైల్‌గా విక్రయించగా కొంత ప్రైవే టు దు కాణాలకు సరఫరా చేయగా మార్క్‌ఫెడ్ మా త్రం జిల్లాలో యాక్టివ్‌గా ఉన్న 43 పీఏసీఎస్, 66 ఏఆర్ఎస్కే, 80 ఎన్డీసీఎమ్మెఎస్, 13ఎఫ్‌పీవోలకు సరఫ రా చేస్తుంది. అయితే ఇప్పటి వరకు జిల్లాకు వచ్చిన యూరియాను వ్యవసాయ శాఖ పీఏఎసీఎస్, ఏఆర్ఎస్కేలకు మాత్రం ఇండెంట్ ప్రకారం ఇస్తూ ఎన్డీసీఎమ్మెస్కు, ఎఫ్‌పీవోలకు మాత్రం కట్ చేశారు. వీటిల్లో పీఏసీఎస్, ఎఫ్‌పీవోలకు మాత్రమే రైతుల భాగస్వామ్యం ఉం టుంది.
ఏఆర్ఎస్కే, ఎన్డీసీఎమ్మెఎస్లో మాత్రం భాగస్వా మ్యం ఉండదు. రైతుల భాగస్వామ్యం ఉన్న పీఏసీఎస్‌లకు ఇస్తున్న మార్క్‌ఫెడ్ ఎఫ్‌పీవోలను మాత్రం పెద్దగా పట్టించుకోవటం లేదు. ప్రధానంగా ప్రతి ఎఫ్‌పీవోలో సుమారు 400 నుంచి 500 మంది రైతులు సభ్యులుగా ఉంటారు. వారికి ఇవ్వకపోవటంతో ఎఫ్‌పీవోల నిర్వాహకులు, వ్యవసాయ అధికారులను వేడుకున్నా ఉపయోగం లేకుండా పోతోంది.
పీఏసీఎస్, ఏఆర్ఎస్కే నిల్వలు పక్కదారి…
నకిరేకల్ మండలంలోని వల్లభాపురం ఏఆర్ఎస్కే నుంచి ఇటీవల సుమారు 200 యూరియా బస్తాలు శాలిగౌరారం మండలంలోని పెర్కకొండారంలోని మహాక్ష్మీ ట్రేడర్స్‌కు బదలాయింపు కాగా, విషయం తెలుసుకున్న వ్యవసాయ అదికారులు తనిఖీకి వెళ్తే ఫలానా రైతులవని..తమవి కావని చెప్పి సదరు దుకాణ యజమాని వారిని పక్కదారి పట్టించారు. ఇక హా లియ మండలంలో ని శ్రీనాథపురానికి ఏఆర్ఎస్కేకు 888 బస్తాలు యూరి యా రాగా ఒక్కో బస్తా రూ.300 చొప్పున విక్రయించినప్పటికీ సంబంధిత అదికారులు పట్టించుకోకపోవటం గమనార్హం.
ఇదే మండలంలోని కొత్తపల్లి పీఏసీఎస్‌కు 666 బస్తాలు రాగా అందులో 250 బస్తాలు రైతులకు ఇచ్చి మిగిలిన 416 బస్తాలు సమీప ఫర్టిలైజర్ దుకాణ దారుడికి ఎమ్మార్పీకి మించి ఇస్తున్నారు. దీంతో బస్తాకు రూ.266 ఎమ్మార్పీ ఉండగా అదనంగా రూ.50 నుంచి 60 అంటే ప్రైవేటు దుకాణ దారులు బస్తాకు రూ.310 చొప్పున విక్రయించట విశేషం. అంటే నిబంధనల ప్రకారం మార్క్‌ఫెడ్ తన నిల్వలను కేవలం పీఏసీఎస్, ఏఆర్ఎస్కే, ఎన్డీసీఎమ్మెఎస్, ఎఫ్‌పీవోలకు తప్ప ఇతర ప్రైవేటు డీలర్లకు ఇవ్వరాదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ, మార్క్‌ఫెడ్, పీఏసీఎస్, ఏఆర్ఎస్కేల నిర్వాహకులు కుమ్మక్కయి అవసరాలకు మించి యూరియా తీసుకొని ప్రైవేటు డీలర్లకు సరఫరా చేయటం వల్ల వారు యూరియాను బ్లాక్ చేసి అధిక ధరకు విక్రయిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇంతేకాకుండా ఏఆర్ఎస్కే నిర్వాహకులు లింక్ పెట్టి యూరియా ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
అరకొర కేటాయింపులతో కొరత..
జిల్లాలో ప్రస్తుత వానకాలం సీజన్లో 11.60 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయనుండగా మరో 73వేల ఎకరాల ఉద్యాన పంటలు ఉన్నాయి. అయితే 11.60 లక్షల ఎకరాలకు గానూ ఇప్పటి వరకు పత్తి 5.10 లక్షల ఎకరాల్లో సాగు కాగా వరి 55 వేలు ఇతర పంటలు మరో ఐదు వేల ఎకరాల్లో సాగు అయ్యాయి. ఇక 45 వేల ఎకరాల్లో బత్తాయి ఉండగా మరో 20 వేల ఎకరాల వరకు ఇతర ఉద్యాన పంటలు ఉన్నాయి. ఈ పంటలకు ఈ సీజన్లో సుమారు 1.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ప్రభుత్వం మాత్రం 70 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించింది.
అందులోనూ ఇప్పటికే 25 వేల మెట్రిక్ టన్నులు రాగా అందులో మార్క్‌ఫెడ్‌తో పాటు మార్కెట్లో మొత్తం తొమ్మిది వేల మెట్రిక్ టన్నులే ఉంది. మరో 35 వేల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 40 శాతం మాత్రమే పంటల సాగు కావటంతో పాటు సాగైన పంటలు కూడా ఆరంభ దశలోనే ఉన్నందున యూరియా వాడకం పెద్దగా లేదు. నేడో రేపో సాగర్ నుంచి ఎడమకాల్వతో పాటు ఏఎమ్మార్పీ లోలెవల్, హైలెవల్ కాల్వలకు నీటిని విడుదల చేస్తే సాగు విస్తీర్ణం పెరిగి యూరియా కొరత తీవ్రమయ్యే అవకాశం ఉంది.