
రామగిరి, ఆగస్టు 24 : పాఠశాలలు, కళాశాలలను సెప్టెంబర్ 1న పునఃప్రారంభించనున్న నేపథ్యంలో విద్యార్థులు సందడి చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటినీ శుభ్రం చేసి సిద్ధం చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను పల్లె ప్రాంతాల్లో గ్రామపంచాయతీ, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాల్టీ సిబ్బందికి పారిశుధ్య బాధ్యతలను అప్పగించింది. తరగతి గదులతోపాటు ఆవరణను శానిటైజ్ చేయాల్సిందిగా ఆదేశించింది.
ఉమ్మడి జిల్లాలో 14,480మంది ఉపాధ్యాయులు..
నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,178 పాఠశాలల్లో 14,480మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అదే విధంగా జూనియర్, డిగ్రీ కళాశాల్లో 1,450మంది అధ్యాపకులు ఉన్నారు. కొవిడ్ నేపథ్యంలో వీరంతా విడుతల వారీగా హాజరవుతుండగా ఈ నెల 26నుంచి రెగ్యులర్గా వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం…
కొవిడ్ కారణంగా ప్రత్యక్ష తరగతుల నిర్వహణ లేక విద్యార్థులకు చాలా నష్టం జరిగింది. అయితే, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ బడులను తెరిచేందుకు అనుమతినిస్తూ, కొవిడ్ నిబంధనలు తప్పకుండా అమలు చేయాలని ఆదేశించడాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం. విద్యార్థికి తరగతి బోధనతోపాటు విజ్ఞాన ఫలాలు అందించడానికి నిత్యం ప్రత్యక్ష బోధన ఎంతో దోహదపడుతుంది.
విద్యార్థుల శ్రేయస్సుకు ప్రాధాన్యమిచ్చారు..
విద్యార్థి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది. పరీక్షలు లేకుండానే పదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్లో చేరిన విద్యార్థులకు సైతం ప్రత్యక్ష తరగతులు లేకపోవడంతో అధ్యాపకులను ఆదవేదనకు గురిచేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రెగ్యులర్ తరగతుల నిర్వహణకు వీలు కలిగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నాం.