వరంగల్ -ఖమ్మం- నల్గొండ శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. బుధవారం సాయంత్రమే ఆయా జిల్లా కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ సిబ్బంది సామగ్రితో కలిసి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ మొదలుపెట్టి 8 గంటల వరకు సర్వం సిద్ధంగా ఉంటారు. మొత్తం 12 జిల్లాలో పరిధిలోని 191 మండలాల్లో విస్తరించి ఉన్న నియోజకవర్గంలో 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ పట్టణాలతోపాటు ఓటర్ల సంఖ్యను బట్టి ఆయా మండల కేంద్రాల్లో మాత్రమే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గురువారం పోలింగ్ ముగిశాక అన్ని జిల్లాల నుంచి పోలింగ్ బాక్స్‌లన్నీ నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాముల్లోని స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలిస్తారు. అక్కడే ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య సీసీ కెమెరాల నిఘాలో వీటిని భద్రపరుస్తారు. వచ్చే నెల 3వ తేదీన కౌంటింగ్ కూడా ఇక్కడే జరుగనుంది.
– నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ)
ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొత్తం 19 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. యూటీఎఫ్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పీఆర్టీయూ-టీఎస్ నుంచి పింగిళి శ్రీపాల్‌రెడ్డి, బీజేపీ నుంచి పులి సర్వోత్తంరెడ్డి, బీసీ సంఘాల మద్దతుతో టీచర్స్ జాక్ నుంచి మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, కుడా మాజీ చైర్మన్ ఎస్. సుందర్రాజ్, ప్రజావాణి పార్టీ నుంచి లింగిడి వెంకటేశ్వర్లు, స్వతంత్ర అభ్యర్థులుగా అర్వ స్వాతి, కంటె సాయన్న, డాక్టర్ కొలిపాక వెంకటస్వామి, గోపాల్‌రెడ్డి పన్నాల, ఏలె చంద్రమోహన్, చాలిక చంద్రశేఖర్, జంగిటి కైలాసం, జె.శంకర్, తలకోల పురుషోత్తంరెడ్డి, తాటికొండ వెంకటరాజయ్య, దామెర బాబురావు, బంక రాజు అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. ఇందులో ప్రధాన సంఘాలకు చెందిన ఐదారుగురు గెలుపుపై ధీమాతో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రతి ఓటరును కలిసే ప్రయత్నం చేశారు. యూటీఎఫ్ మినహా మిగతా ప్రధాన అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చివరి వరకు ప్రయత్నాలు కొనసాగించారు.
ఉపాధ్యాయ నియోజకవర్గ పరిధిలో మొత్తం 25,797 మంది ఓటు హకును వినియోగించుకోనున్నారు. ఓటర్లలో పురుషులు 15483 మంది, మహిళలు 10314 మంది ఉన్నారు. అత్యధికంగా హన్మకొండ, తర్వాత నల్లగొండ, ఖమ్మం జిల్లాలో ఓటర్లు ఉన్నారు. అతి తక్కువగా సిద్దిపేట జిల్లా(4మండలాలు)లో 168 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 8,331 మంది ఓటర్లు ఉండగా అందులో నల్లగొండ జిల్లాలో 4,683 మంది, సూర్యాపేట జిల్లాలో 2,664 మంది, యాదాద్రి జిల్లాలో 984 మంది ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ నిర్వహణ కోసం 752 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల ఆవరణలో టెంట్స్, సరైన లైటింగ్, బయట మెడికల్ టీమ్స్ లాంటి మౌలిక వసతులు కూడా కల్పించారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ కూడా అమలులో పెట్టారు.
కిందటిసారి 2019 మార్చిలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలు జరిగాయి. మొత్తం 18,885 ఓట్లు పోలు కాగా అందులో 18,027 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. అంటే 858 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇలా చెల్లని ఓట్లతో మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే తేలాల్సిన ఫలితం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు వరకు వెళ్లింది. వాస్తవంగా గత ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్లలో మరో 38 వచ్చి ఉంటే యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి అక్కడే గెలిచి ఉండేవారు. కానీ చెల్లని ఓట్ల సంఖ్య గణనీయంగా ఉండడంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సి వచ్చింది.
ఇక ఇదే తరహాలో 2013 మార్చిలో జరిగిన ఎన్నికలోనూ చెల్లని ఓట్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. అందుకే నేడు జరుగబోయే పోలింగ్‌లోనూ ఎన్నికల నిబంధనలపై గురువు స్థానంలో ఉన్న ఓటర్లు పూర్తి అవగాహనతో ఓటింగ్ వెళ్లాల్సిందే. ఓటు వేసే సమయంలో ప్రతి ఓటరు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయడం తప్పనిసరి. ఓటు వేసే క్రమంలో ఎక్కడా కూడా ప్రాధాన్యత క్రమం తప్పకుండా చూసుకోవాలి. ఓటు వేసేటప్పుడు కచ్చితంగా ఇంగ్లిష్ లేదా రోమన్ అంకెల్లో ఓటు వేయవచ్చు.
ఇందులోనూ రోమన్ అంకెల కంటే ఇంగ్లిష్ అంకెల్లో ఓటు వేయడమే చాలా సులువు. అందుకే ఇంగ్లిష్ అంకెలుగా పిలవబడే ‘1,2,3,4,5,…. 19’ వరకు ప్రాధాన్యతలు ఇస్తూ వెళ్లవచ్చు. ఇలా అంకెలు కాకుండా ‘ఒకటి, రెండు, మూడు, నాలుగు…. పందొమ్మిది” ఇలా అక్షరాల్లో రాస్తే ఓటు చెల్లదు. ఇక ఇవి కాకుండా రైట్ లేదా ఇతర గుర్తులు, చిహ్నాలు ఇవేవీ బ్యాలెట్ పేపర్ పైన రాసినా అవి కూడా చెల్లని జాబితాలోకే వెళతాయి. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లకు ఎదురుగా వారి ఫొటో ఆ తర్వాత ఓటు వేసేందుకు ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ మధ్యలోనే స్పష్టంగా అర్థమయ్యేలా తమ ప్రాధాన్యత ఓటును అంకెల్లో రాయాలి.