సూర్యాపేట జిల్లా కేంద్రం.. ఖమ్మం రోడ్డు మీదుగా కుడకుడవైపు వెళ్లే రోడ్డులో తిరుమలనగర్‌లో ఉంటుంది ఆ ఇల్లు.. కొత్తవారెవరైనా అటుగా వెళ్లారంటే ఆ ఇంటి వైపు చూపు
తిప్పుకోవాల్సిందే. ఆవరణలో మొక్కలు, టెర్రస్‌పై పచ్చదనం మనసును ఆకట్టుకుంటుంది. సుమారు 150గజాల విస్తీర్ణంలో 150కి పైగా పలు రకాల మొక్కలను పెంచుతున్నారు.. పులిగుజ్జు లక్ష్మయ్య-రేణుక దంపతులు. అనుకోని ప్రమాదంలో దూరమైన తమ కొడుకు జ్ఞాపకాలను మర్చిపోయేందుకు మొక్కలనే పసిపిల్లల్లా పెంచుకుంటున్నామని, పూలు, పండ్లలో తనను చూసుకుంటున్నామని చెప్తున్నారు.
లక్ష్మయ్య-రేణుక దంపతులకు ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. లక్ష్మయ్య ఆర్ఎంపీగా పని చేస్తుండగా రేణుక ఇంటి వద్దనే ఉంటుంది. చేతికి అంది వచ్చిన వారి కుమారుడు పృధ్వీరాజ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం ఆ కుటుంబంలో పెను విషాదం నింపింది. మొక్కలు పెంచుతూ వాటిల్లో అన్నయ్యను చూసుకొమ్మని కూతురు ఇచ్చిన సలహాతో దంపతులిద్దరూ రెండేళ్ల శ్రమ కోర్చి ఇంటి ఆవరణను బృందావనంలా మార్చేశారు. మిద్దెపై పూలు, పండ్లతో పాటు రోజుకు 34కిలోల కూరగాయలు, ఆకు కూరలను పండిస్తూ ఇరుగుపొరుగుకు ఉచితంగా అందిస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నారు.
ఒక్క పురుగూ లేదు..
మిద్దెపై 150గజాల స్థలంలో 150రకాల మొక్కలను పెంచుతున్నప్పటికీ ఏ ఒక్క మొక్క కూడా పురుగు పట్టకపోవడం విశేషం. రాలిపోయిన ఆకులను, కాడలను ఎప్పటికప్పుడు తీసేస్తూ సేంద్రియ ఎరువుగా వాడుతారు. లక్ష్మయ్య ఉదయాన్నే చుట్టుపక్కల పేడను సేకరించి వేపాకులు, నీమ్ ఆయిల్‌తో కలిపి వేడి చేసిన మరుసటి రోజు నుంచి మొక్కలకు పిచికారీ చేస్తుంటాడు. దాంతో పురుగులు ఆశించే అవకాశం లేదని తెలిపాడు.
కోళ్లు, ఉడుతలు, పిచ్చుకలకు ఆవాసం..
ఇంటి నిండా పచ్చదనం అల్లుకోవడంతో ఎవరైనా ఆ ఇంటికి వెళ్తే పట్టణంలోనే ఉన్నామా అనే అనుమానం కలుగుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎన్నో రకాల పిచ్చుకలు, ఉడుతలు గూడు కట్టుకున్నాయి. పిచ్చుకలకు నూకలు, ఉడుతలకు పండ్లు, పాలు అందిస్తున్నారు. దాంతో ఇల్లంతా ఎంతో సందడిగా ఉంటుంది.
పూలు, పండ్లలో మా కుమారుడిని చూసుకుంటున్నాం..
మా కొడుకు జ్ఞాపకాల నుంచి దూరం కావడానికి మొక్కలు పెంచడం మొదలు పెట్టాం. రోజంతా వాటి పర్యవేక్షణతోనే సమయం గడిచిపోతుంది. క్రమం తప్పకుండా పండు ఆకులను తొలగించి వాటిని ఒక బుట్టలో వేయడంతో పాటు ఇంట్లో వ్యర్థాలతో ఎరువులు తయారు చేస్తాం. పురుగు ఎలా ఉంటుందో మా మొక్కలకు ఇప్పటి వరకూ తెలియదు. మేము వంట చేసుకోగా మిగిలిన కూరగాయలు చుట్టు పక్కల వాళ్లకు పంచుతం. – పులిగుజ్జు రేణుకాలక్ష్మయ్య, సూర్యాపేట