గురువారం 04 జూన్ 2020
Nagarkurnool - Jan 30, 2020 , 01:17:03

ప్రయోగ పరీక్షలకు సిద్ధం

ప్రయోగ పరీక్షలకు సిద్ధం
  • ఏర్పాట్లు పూర్తి చేసిన ఇంటర్‌ బోర్డు సిబ్బంది
  • అర్ధగంట ముందే పరీక్ష హాలుకు చేరాలి
  • రెండు స్పెల్స్‌గా పరీక్షలు

కందనూలు : ఇంటర్‌లో వార్షిక పరీక్షలతో పాటు ప్రయోగ పరీక్షలు సైతం చేయాల్సి ఉంటుంది. పది నెలల్లో అధ్యాపకులు సిలబస్‌ పూర్తి చేయడంలో నిమగ్నమైతే, విద్యార్థులు పాఠాలు నేర్చే క్రమంలో హడావిడిగా ఉంటారు. సిలబస్‌ పూర్తైన వెంటనే వచ్చేదే ప్రయోగ పరీక్షలు. అటువంటి ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 1నుంచి ప్రారంభమవుతుండగా, అటు విద్యార్థులు, ఇటు అధ్యాపకులు       చాలా హడావిడిగా కనిపిస్తున్నారు. ఇంటర్‌ ప్రయో  పరీక్షలు వచ్చాయంటే దాదాపు పరీక్షల సీజన్‌ మొదలైందని అధికారులంటున్నారు. ఇంటర్‌ సిబ్బంది ప్రయోగ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. ప్రయోగ పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు జిల్లా నోడల్‌ అధికారి పేర్కొన్నారు.   ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానుండడంతో విద్యార్థులు వారి వారి రికార్డులను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రయోగ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నలపై పలు మార్లు ప్రయోగాలు చేస్తూ నిష్ణాతులుగా తయారవుతున్నారు. వైవాలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు టకటక చెప్పేందుకు సిలబస్‌ను తిరిగేస్తున్నారు.

జిల్లాలో మొత్తం 57 జూనియర్‌ కళాశాలలున్నాయి. వాటిలో నుంచి 37 కళాశాలను జనరల్‌ ప్రయోగ పరీక్షలు  చేయడానికి, 8 కళాశాలలు ఒకేషనల్‌ ప్రయోగ పరీక్షలు నిర్వహించడానికి ఎంపిక చేశామని అధికారులు తెలిపారు. జిల్లాల నుంచి బైపీసీ నుంచి 1620 మంది విద్యార్థులు, ఎంపీసీ నుంచి 2818 మంది విద్యార్థులు ప్రయోగ పరీక్షలు హాజరు కానున్నారు. ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 1నుంచి 20వ తేదీ వరకు 4స్పెల్స్‌గా విభజించి ఒక్కో స్పెల్‌ను 5 రోజులుగా నిర్వహించ నున్నారు. పరీక్షలు ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు ఉంటాయి. విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను ఆన్‌లైన్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. ప్రశ్నాపత్రాలు అధ్యాపకులు ఆన్‌లైన్‌ నుంచి తీసి ఇస్తారు. వాటికి సంబంధించిన సమాధానాలు కంపూటర్లలో రాయాల్సి ఉంటుంది.  మార్కులను కూడా వెంటనే ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తారు. విద్యార్థులు పరీక్షలకు 30నిమిషాల ముందు హాల్‌కు వచ్చి తమ ఓటీపీ నెంబర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయోగ పరీక్షలన్నీ మొదటి సారిగా సీసీ టీవీ పర్యవేక్షణలో నిర్వహిస్తారు. ఈ తరుణంలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఉండదు. విద్యార్థులు ప్రయోగ  పరీక్షలో కళాశాలకు ఎలాంటి రుసుం చెల్లించాల్సి ఉండదు. కేవలం పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. పరీక్షకు వచ్చేటప్పుడు తమ తమ రికార్డులను వెంట తెచ్చుకోవాలి. పరీక్షలలో రికార్డులు చూపించని వారికి రికార్డు మార్కులు ఉండవు. మిగితా అంశాలకు సంబంధించని మార్కులను మాత్రమే వేస్తారు. 


logo