శనివారం 06 జూన్ 2020
Nagarkurnool - Jan 17, 2020 , 02:28:30

నేత్రపర్వం

 నేత్రపర్వం


అచ్చంపేట రూరల్ : శ్రీశైల ఉత్తర ధ్వారమైన ఉమామహేశ్వర క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 15న ప్రారంభమైన ఉత్సవాల సందర్భంగా స్వామివారు ప్రత్యేక పూజలందుకుంటున్నారు. బుధవారం రాత్రి ఆయా గ్రామాల నుంచి వచ్చిన ‘ప్రభోత్సవము’ లు మధ్యరాత్రి 2 గంటలకు ఉమామహేశ్వరం చేరుకున్నాయి. గురువారం తెల్లవారుజామున ఐదు గంటలకు కొండ కింద భాగంలో ఉన్న భోగమహేశ్వరంలో ఏర్పాటు చేసిన వేదికలో పార్వతీ పరమేశ్వరులకు అంగరంగ వైభవంగా కల్యాణం జరిపించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాల్ ఆయన సతీమణి గువ్వల అమలలు పార్వతీ పరమేశ్వరుల కల్యాణానికి పట్టు వస్ర్తాలు సమర్పించి కల్యాణంలో పాల్గొన్నారు.

విప్ గువ్వల బాల్ సమక్షంలో జరిపించిన కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు వేలాధిగా తరలివచ్చారు. పార్వతీ పరమేశ్వరుల కల్యాణం సందర్భంగా నియోజక వర్గంలోని ప్రజలందరూ ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి సెంటు గుంటకు సాగునీరు అందేలా చూడాలని వేడుకున్నట్లు పేర్కొన్నారు. కల్యాణం అనంతరం భోగమహేశ్వరం నుంచి పల్లకీ సేవ ద్వారా ఉమామహేశ్వర క్షేత్రానికి చేర్చారు. అనంతరం గవ్యాంత పూజలు, వాస్తు పూజ, హోమం, రుద్రాభిషేకం, రుద్రహోమం, ప్రాతరౌపాసన, నిత్య బలిహరణ, నీలలోహిత పూజ, సాయమౌపాసన, మంత్ర పుష్పం మొదలైన పూజలు నిర్వహించినట్లు దేవస్థాన చైర్మన్ సుధాకర్, ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు.  ఎంపీపీ శాంతా లోక్యానాయక్, జెడ్పీటీసీ మంత్య్రా నాయక్, టీఆర్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహ్మగౌడ్, రైతు సమితి మండల అధ్యక్షుడు రాజేశ్వర్ దేవస్థాన సిబ్బంది ఉన్నారు.
logo