మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - Jul 28, 2020 , 03:31:50

నియంత్రణ చర్యలు చేపట్టాలి

నియంత్రణ చర్యలు చేపట్టాలి

  • కొవిడ్‌-19  బాధితులకు హోం ఐసోలేషన్‌ కిట్స్‌ అందుబాటులో ఉంచాలి
  • ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలి
  • కలెక్టర్‌ ఎస్‌.కృష్ణ ఆదిత్య

ములుగు కలెక్టరేట్‌, జూలై 27 : కొవిడ్‌-19 నియంత్రణకు  రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఎస్‌.కృష్ణ ఆదిత్య అన్నారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లా అధికారులతో సోమవారం శాఖాపరమైన పనుల పురోగతిపై సమీక్షించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న అధికారులు, సిబ్బందికి కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. హోం ఐసోలేషన్‌ కిట్స్‌ అందుబాటులో ఉంచాలన్నారు. సీజనల్‌ వ్యాధుల దృష్ట్యా అవసరమైన మందులు బఫర్‌ స్టాక్‌తో అన్ని ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో ఉంచాలన్నారు.

పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా చేపట్టాలన్నారు. ఫాగింగ్‌, ఆయిల్‌ బాల్స్‌ స్ప్రే చేపట్టాలన్నారు. సోడియం హైపోక్లోరైట్‌ బఫర్‌ స్టాక్‌ సిద్ధంగా ఉండాలన్నారు. ఏజెన్సీ గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇంజినీరింగ్‌ శాఖ అధికారులు తాము చేపడుతున్న పనుల పురోగతిపై నివేదిక సమర్పించాలన్నారు. విరిగిన స్తంభాలు, వేలాడే తీగలు లేకుండా చూడాలన్నారు. నీటి వనరుల్లో చేపల విడుదలపై టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. చేపల విడుదల పారదర్శకంగా చేపట్టాలని, విడుదల ప్రక్రియను వీడియో తీయాలన్నారు. చేప పిల్లల సంఖ్యపై పూర్తి స్పష్టత ఉండాలన్నారు. జిల్లాలో బాల కార్మికులు లేరని, బాల్య వివాహాలు జరగలేదని ప్రతి 15 రోజులకొకసారి నివేదిక సమర్పించాలన్నారు. మినీ డైరీల విషయంలో సొసైటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుని ఈడీ ఎస్సీ కార్పొరేషన్‌, జిల్లా సహకార అధికారి, పశుసంవర్ధక అధికారులు సమన్వయంతో మినీ డైరీల గ్రౌండింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సమీక్షలో జిల్లా రెవెన్యూ అధికారిణి కే రమాదేవి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ తుల రవి, జిల్లా సహకార అధికారి విజయ భాస్కర్‌ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక అధికారి విజయ భాస్కర్‌, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్‌ అప్పయ్య, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.


logo