శనివారం 08 ఆగస్టు 2020
Mulugu - Feb 02, 2020 , 03:44:40

జాతర ఏర్పాట్లు అద్భుతం

జాతర ఏర్పాట్లు  అద్భుతం
  • మేడారం భక్తులకు మెరుగైన రవాణా..
  • ఆర్టీసీ బస్‌ పాయింట్‌ ప్రారంభం
  • దేశ వ్యాప్తంగా ప్రముఖులకు ఆహ్వానం
  • 7న మేడారానికి గవర్నర్‌, సీఎం
  • మేడారంలో పర్యటన, అధికారులతో సమీక్ష
  • రూ. 800 కోట్లతో రహదారులు
  • ఆదివాసీ సంప్రదాయాలకు ప్రాధాన్యం
  • పూజారుల మనోభావాలను గౌరవిస్తాం

ములుగు జిల్లా ప్రతినిధి/ నమస్తే తెలంగాణ: మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించినట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు.  రూ. 800 కోట్లతో జాతీయ రహదారి, ఆర్‌ అండ్‌ బీ ద్వారా రోడ్ల పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి మేడారంలో శనివారం పర్యటించారు. హైదరాబాద్‌ నుంచి మేడారం వరకు రోడ్లను పరిశీలించారు. మేడారంలో ఆర్టీసీ బస్టాండ్‌, మీడియా పాయింట్‌ను ప్రారంభించారు. తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. బస్టాండ్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో  మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ జాతర నిర్వహణ ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని, జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పలు రోడ్లను పరిశీలించినట్లు తెలిపారు. 


హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వరకు, మహబూబాబాద్‌ నుంచి నర్సంపేట, వరంగల్‌ నుంచి మేడారం వరకు వరంగల్‌ నుంచి భూపాలపల్లి వరకు చేపట్టిన ఐదు రోడ్లను చూసినట్లు చెప్పారు. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వరకు వంగపల్లి, స్టేషన్‌ఘనపూర్‌, రఘునాథ్‌పల్లి వరకు కాస్త సమస్యలు ఉన్నాయని, వాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. వరంగల్‌ నుంచి భూపాలపల్లి వరకు రూ. 359 కోట్లతో చేపట్టిన రోడ్డు నిర్మాణం పూర్తి కావొచ్చిందన్నారు. వరంగల్‌ నుంచి ఏటూరునాగారం వరకు రూ. 241 కోట్లతో చేపట్టిన రోడ్డు పనులు పూర్తి కావచ్చాయని, మేడారం జాతర సందర్భంగా రూ. 12 కోట్లతో రోడ్లకు మరమ్మతులు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. మహబూబాబాద్‌ నుంచి నర్సంపేట వరకు చేపట్టిన 32 కిలోమీటర్లలో 28 కిలోమీటర్ల రోడ్డు పనులు పూర్తి చేశామని, మరో నాలుగు కిలోమీటర్లు పూర్తి కావాల్సి ఉందని మంత్రి వెల్లడించారు. జాతరలో బారికేడ్లకు మెటీరియల్‌ను సమకూర్చామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భక్తులు సహనంతో వ్యవహరించాలన్నారు.


మేడారంలో మీడియా సెంటర్‌

మేడారంలోని ప్రభుత్వ దవాఖాన పక్కన ఉన్న భవనంలో మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దానిని మంత్రులు, అతిథులు ప్రారంభించారు. జాతరను దిగ్విజయంగా నడిపేందుకు మీడియా సహకారం అవసరమని వారు కోరారు. మీడియా సెంటర్‌లో ప్రతినిధులకు వార్తలు ఎప్పటికప్పుడు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. కంప్యూటర్లు, స్కానర్‌, ప్రింటర్‌, ఇంటర్నెట్‌ సౌకర్యంతో పాటు టెలిఫోన్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జాతర ముగిసే వరకు మీడియా సెంటర్‌ ఉంటుందన్నారు.


logo