ఉత్తరాదిన పుట్టి పెరిగినా దక్షిణాదిపై అభిమానం ఆమెకు. అదే తమిళ, తెలుగు పరిశ్రమల్లో అవకాశాలు అందించింది. థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, చేతికందిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు, సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తోంది జీ తెలుగు ‘మా అన్నయ్య’ సీరియల్ నటి స్మృతీ కశ్యప్. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదినే టెలివిజన్ నటీనటులకు ప్రేక్షకుల్లో ఆదరణ ఎక్కువ అంటూ జిందగీతో స్మృతి పంచుకున్న ముచ్చట్లు..
నేను పుట్టిపెరిగింది ఉత్తర్‌ప్రదేశ్‌లో అయినా కెరీర్ ప్రారంభించింది ముంబయిలో. బీకాం పూర్తయ్యాక ముంబయికి వెళ్లి మోడలింగ్ చేస్తూనే, థియేటర్ ఆర్టిస్ట్‌గా పనిచేశా. మా అమ్మ కూడా టెలివిజన్ నటి కావడంతో నటనపై ఆసక్తి పెరిగింది. నేను చదువుకున్న బోర్డింగ్ స్కూల్లో చదువుతోపాటే ఆటపాటల మీద కూడా ఫోకస్ చేసేవాళ్లు. నాకు కూడా చదువు కంటే మిగతా సాంస్కృతిక కార్యక్రమాలంటేనే ఆసక్తిగా ఉండేది. అమ్మ హిందీ, బెంగాలీ సీరియల్స్‌లో నటిస్తుంది. నేను అమ్మతోపాటు షూటింగ్స్‌కి వెళ్తుండేదాన్ని. అమ్మ తప్ప మా కుటుంబంలో అందరూ ప్రభుత్వ ఉద్యోగులే. నన్ను కూడా ప్రభుత్వ ఉద్యోగిగానే చూడాలనుకున్నారు. నాకు మాత్రం నటనే ప్యాషన్ అయింది.
చిన్నప్పటి నుంచీ మాధురీ దీక్షిత్‌కి వీరాభిమానిని. ఆమెలా తెరపై కనిపించి అందరి మెప్పు పొందాలనుకున్నా. థియేటర్లో పనిచేస్తుండగా ఓ హిందీ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత సరిగమప ప్రొడక్షన్స్‌లో తమిళ సీరియల్ రోజాలో నటించాను. మంచి పేరు వచ్చింది. అందులో నెగెటివ్ రోల్. హీరోయిన్గా నా మొదటి సీరియల్ జీ తెలుగులో ప్రసారమవుతున్న మా అన్నయ్య. దీంతోపాటు సన్‌టీవీలో మరో సీరియల్లో నటిస్తున్నా. ఉత్తరాదికంటే దక్షిణాదిన టెలివిజన్ షోస్‌ను, నటీనటులను అమితంగా ఆదరిస్తారు. మా అన్నయ్య సీరియల్ ఈమధ్యనే ప్రారంభమైనా బయటికి వెళ్తే అందరూ నన్ను గుర్తుపట్టి ‘శివ’ అంటూ నా పాత్ర పేరుతో పిలుస్తున్నారు. నన్ను తమ అమ్మాయిగా ఆదరిస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటా. మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను.
రోజా సీరియల్లో అవకాశం వచ్చినప్పుడు నాకు అస్సలు తమిళ్ రాకపోవడంతో బాగా భయపడ్డా. కానీ సీరియల్ టీమ్ సపోర్ట్‌తో త్వరగానే తమిళ్ నేర్చుకున్నా. ఇప్పుడు చక్కగా మాట్లాడగలను కూడా. తెలుగులో అవకాశం వచ్చినప్పుడు కూడా అలాగే అనిపించింది. కానీ ‘మా అన్నయ్య’ టీమ్ నన్ను బాగా సపోర్ట్ చేసింది. డైరెక్షన్ టీమ్‌లోని వారందరూ నాతో ఓపిగ్గా డైలాగ్స్ చెప్పిస్తారు. అస్సలు భాష తెలియకపోయినా చాలా కాన్ఫిడెంట్‌గా సీన్‌కి కావల్సిన ఎమోషన్స్ ఇస్తానని మెచ్చుకుంటారు. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినా పెద్ద తేడా లేదు. అక్కడా ఇక్కడా వాతావరణం దాదాపుగా ఒకటే. కానీ ఇక్కడ హిందీ, ఇంగ్లిష్ ఎక్కువగా మాట్లాడతారు. దాంతో నాకు భాష పెద్ద సమస్యగా మారలేదు.
నేను టామ్ బాయ్ టైపు. అందుకే మా అన్నయ్య సీరియల్ కథ వినగానే ఒప్పుకొన్నా. కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచీ ఐఏఎస్, పోలీస్ వంటి పవర్ఫుల్ క్యారెక్టర్లో నటించాలని అనుకున్నా. ఆ కోరిక మా అన్నయ్య సీరియల్‌తో తీరింది. రొమాన్స్ కన్నా ఫైటింగ్, యాక్షన్ అంటేనే ఇష్టం. చిన్నప్పటినుంచీ నాకు దక్షిణాది ఫుడ్ అంటే చాలా ఇష్టం. కానీ మా ఇంట్లో బంధువులు వచ్చినప్పుడు మినహా ఇడ్లీ, దోశ వంటివి చేసేవాళ్లు కాదు. ఇప్పుడు మూడుపూటలా ఇడ్లీ, సాంబార్ తింటున్నా.
తెలుగులో మహేష్ బాబు, విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం. వాళ్ల ప్రతి సినిమా మిస్‌కాకుండా చూస్తాను. త్వరలోనే వాళ్లను కలిసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నా. ఇంట్లో అమ్మ, నేను సీరియల్స్, స్టోరీస్ గురించి చర్చించుకుంటాం. భాష రాకపోయినా నా ప్రతి సీరియల్‌ని ఇంట్లో అందరూ చూస్తారు. అమ్మ నటనలో మెలకువలు చెబుతుంది.. కొన్ని సినిమాల్లో అవకాశం వచ్చినా, రొమాంటిక్ రోల్స్‌లో నటించడానికి ఇంట్లో అనుమతి లేదు కనుక ఒప్పుకోలేదు. మంచి పాత్ర వస్తే మాత్రం చేస్తా. సీరియళ్లలో నన్ను నేను మెరుగుపరచుకునేందుకు కష్టపడుతూనే ఉంటా.
-హరిణి