ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే.. ప్రతిభ ఒక్కటే సరిపోదని అంటున్నది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్! అందులోనూ బయటి వ్యక్తులు చాలా కష్టపడాల్సి ఉంటుందని చెబుతున్నది. తాజాగా, ఓ జాతీయ మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో కృతి సనన్ పాల్గొన్నది. ఈ సందర్భంగా బాలీవుడ్లో బయటి వ్యక్తులు ఎదుర్కొంటున్న సవాళ్లపై స్పందించింది. ఇండస్ట్రీలోకి కొత్తగా రావాలనుకునేవారికి కొన్ని సలహాలు సూచించింది. “సినిమా నేపథ్య కుటుంబం లేకపోతే.. ఇండస్ట్రీలో రాణించడం కష్టం. అందుకోసం గట్టి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏదీ ఈజీగా లభించదు. కనీసం తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. అన్నిటినీ తట్టుకోగలమని అనుకుంటేనే.. బీటౌన్ బాటపట్టాలి” అంటూ చెప్పుకొచ్చింది. బాలీవుడ్లో రాణించడానికి దగ్గరి, సులభమైన మార్గం ఏదీ లేదని.. కష్టపడి పనిచేస్తేనే గుర్తింపు ఉంటుందని వెల్లడించింది కృతి.
ఇంకా మాట్లాడుతూ.. “అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అవకాశాలు వచ్చినా, రాకపోయినా ఇండస్ట్రీని వదిలేయొద్దు. ఎందుకంటే.. మనకంటూ ఓ సమయం వస్తుంది. అప్పుడు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అప్పటివరకూ వేచిచూడాల్సిందే!” అని సలహా ఇచ్చింది. అవకాశాల కోసం తిరిగితే ఎన్నెన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందనీ, ఇక్కడ అందరూ వంకలు పెట్టేవారేననీ వాపోయిందామె. “మీరు పొట్టిగా ఉన్నారనో, లేకుంటే హైట్ ఎక్కువగా ఉన్నదనో, సన్నగా ఉన్నారనో చెబుతూ.. అవకాశాలు ఇవ్వడానికి నిరాకరిస్తారు. మీలోని లోపాలనే వెతుకుతారు. అంతేకానీ, ఈ పాత్రను మీరు తప్ప మరెవరూ చేయలేరని మాత్రం ఎన్నటికీ చెప్పరు. అయినా నిరుత్సాహపడకుండా.. ఎప్పుడూ ఉత్సాహంగా, ఓపికగా, సినిమాలపై మక్కువతో ఉండాలి.
సరైన సమయం వచ్చినప్పుడు విజయం వరిస్తుంద”ని చెప్పింది. కృతి కెరీర్ విషయానికి వస్తే.. ఇంజినీరింగ్ విద్యార్థినిగా,మోడల్‌గా వృత్తిజీవితాన్ని ప్రారంభించిందామె. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 2014లో మహేశ్‌బాబు-సుకుమార్ కాంబోలో వచ్చిన ‘1 : నేనొక్కడినే’ చిత్రంతో ఇండస్ట్రీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. అదే సంవత్సరం టైగర్ ష్రాఫ్ సరసన ‘హీరోపంతి’తో బీటౌన్ బాటపట్టింది. కెరీర్ ఆరంభంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నది. వచ్చిన ప్రతి అవకాశాన్నీ అందుకుని.. తన ప్రతిభతోనే ప్రేక్షకులను మెప్పించింది.