Kavya Kalyanram | ‘బలగం’ సినిమాతో తెలంగాణ బలగంలో కలిసిపోయింది కావ్య కల్యాణ్‌రామ్. చిన్నప్పుడే ‘స్నేహమంటే ఇదేరా..’లో తళుక్కున మెరిసిందీ కథానాయిక. ప్రస్తుతం బలగం విజయాన్ని ఆస్వాదిస్తూ.. ‘ఉస్తాద్’ సినిమాతో మనల్ని మరోసారి పలకరించబోతున్నది. ఈ సందర్భంగా కావ్య ముచ్చట్లు..
పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. చిన్నప్పుడే నాగార్జున, సుమంత్, సుధాకర్ నటించిన ‘స్నేహమంటే ఇదేరా’ సినిమాతో పరిచయమయ్యాను. కాకపోతే మీరంతా నన్ను గంగోత్రిగానే గుర్తు పెట్టుకున్నారు. మీ హృదయంలో నాకింత చోటిచ్చినందుకు థ్యాంక్స్.
నేను.. అల్లు అర్జున్‌తో గంగోత్రి చిత్రం మాత్రమే చేశానని చాలామంది అనుకుంటారు. అది తప్పు. ‘బన్నీ’లోనూ నటించాను. తను ఎనర్జెటిక్ హీరో. నిజానికి, బలగం కంటే ముందు ‘ఉస్తాద్’ ఓకే అయింది. అంతకంటే ముందే ‘మసూద’ రిలీజ్ అయింది. ఆ సినిమాకు చాలా పేరొచ్చింది. ఇదంతా ప్రేక్షకుల ఆశీర్వాదమే.
బలగం సినిమా చూసిన కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు.. ‘చాలా బాగా నటించావ్. ఈ సినిమాకు నీకు నంది అవార్డు పక్కా’ అన్నారు. అవార్డు సంగతి అటుంచితే.. పెద్దలను మెప్పించడమే పెద్ద పురస్కారం అనిపించింది. కెరీర్ విషయానికొస్తే ఇప్పుడు అవకాశాలు పెరిగాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు చేతిలో ఉన్నాయి. ‘బలగం’ ఇప్పటివరకు తొమ్మిది ఇంటర్నేషనల్ అవార్డులు సాధించింది. అందులో నాదీ ఒకటి ఉంది. దిల్ రాజు గారు ఆస్కార్ నామినేషన్స్‌కి పంపిస్తా అన్నారు. చాలా హ్యాపీగా ఉంది.
ఒక వయసు రాగానే చాలామంది మహిళలు తమ పని అయిపోయింది అనుకుంటారు. కెరీర్ ముందుకు వెళ్లదు అని ఫిక్స్ అవుతారు. మీ ఆలోచనే మీ పెట్టుబడి. పాజిటివ్ థింకింగ్‌తో అడుగు ముందుకు వేయండి. నేను ఇదే సూత్రం అనుసరిస్తా.
‘గంగోత్రి’ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఆ ధ్యాసలో పడిపోతే చదువు దెబ్బతింటుందనే భయంతో.. కొంత గ్యాప్ ఇచ్చి చదువు పూర్తిచేశాను. పుణె సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో బీఏ, ఎల్ఎల్బీ పట్టా అందుకున్నాను.
తీరిక దొరికితే ట్రావెలింగ్ చేస్తాను. షాపింగ్ వెళ్తాను. కొన్నిసార్లయితే.. అప్పటికే ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కొనేస్తుంటాను. షాపింగ్ చేస్తుంటే నాదైన ఒక కొత్తలోకంలో విహరిస్తున్నట్టు అనిపిస్తుంది. పుస్తకాలు బాగా చదువుతా.
అమ్మ చేతి వంట ఇష్టం. తను గరిట తిప్పి ఏం వండినా అమృతంలానే ఉంటుంది. అమ్మ వండితే ఓ ముద్ద ఎక్కువే తినేస్తా. నేను కాస్త బొద్దుగా ఉండటానికి ఇదే కారణం. ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేయడమంటే సరదా. మనల్ని యథాతథంగా స్వీకరించేది ఫ్రెండ్స్ మాత్రమే. అందుకే.. నా ప్రతి పుట్టినరోజు క్లోజ్‌ఫ్రెండ్స్ మధ్య జరుపుకొంటా. పార్టీ కూడా వాళ్లతోనే. అందరం కలిసినప్పుడు సందడే సందడి.