గురువారం 26 నవంబర్ 2020
Medchal - Jul 23, 2020 , 00:04:31

మల్కాజిగిరిలో యాదాద్రి తరహా ప్లాంటేషన్‌

మల్కాజిగిరిలో  యాదాద్రి తరహా ప్లాంటేషన్‌

 నియోజకవర్గంలో మూడు చోట్ల అడవుల పెంపకం... 

మల్కాజిగిరి : హరితహారం కార్యక్రమంలో భాగంగా యాదాద్రి  తరహా ప్లాంటేషన్‌లో మొక్కలు నాటే పనులు ప్రారంభమయ్యాయి. మల్కాజిగిరి నియోజకవర్గంలోని మూడెకరాల్లో యాదాద్రి తరహా ప్లాంటేషన్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. మల్కాజిగిరి సర్కిల్‌ యాప్రాల్‌లోని కల్యాణి సులోచన ఎన్‌క్లేవ్‌, షిర్డీనగర్‌ ఎన్‌క్లేవ్‌, అల్వాల్‌ సర్కిల్‌ కౌకుర్‌లో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్‌లో రకరకాల మొక్కలు నాటనున్నారు. ఇప్పటి వరకు మూడు ప్లాంటేషన్లలో 14 వేల మొక్కలు నాటారు. మరో వారం రోజుల్లో మొక్కలు నాటే పనులు పూర్తి చేయనున్నారు. 

మూడెకరాల్లో   అడవులు.. 

 మల్కాజిగిరి నియోజకవర్గంలోని మూడెకరాల్లో ఫారెస్ట్‌ తరహాలో అడవులను సృష్టించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మల్కాజిగిరి యాప్రాల్‌లోని కల్యాణి సులోచన ఎన్‌క్లేవ్‌ 25 వేలకు గాను 14వేల మొక్కలు నాటారు.  షిర్డీనగర్‌ ఎన్‌క్లేవ్‌లో 25 వేల  మొక్కలు , అల్వాల్‌లోని కౌకుర్‌లో 8 వేల మొక్కలు నాటే ప్రణాళికతో జీహెచ్‌ంఎసీ అధికారులు ముందుకు సాగుతున్నారు. నాటిన మొక్కలను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. మొక్కలు పెరిగే వరకు జీహెచ్‌ఎంసీ అధికారులు పర్యవేక్షించనున్నారు. హరితహారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ ప్లాంటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశాలు ఇచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. 

హరితహారంలో 15 లక్షల మొక్కలు ... 

మల్కాజిగిరి నియోజకవర్గంలోని మల్కాజిగిరి సర్కిల్‌ లోని  నేరేడ్‌మెట్‌, వినాయక్‌నగర్‌, మౌలాలి, ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌, మల్కాజిగిరి, గౌతంనగర్‌, అల్వాల్‌ సర్కిల్‌లోని అల్వాల్‌, వెంకటాపురం, మచ్చబొల్లారం డివిజన్లలో హరితహారంలో భాగంగా 15 లక్షల మొక్కలు నాటనున్నారు. పార్కులు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటే ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. కాలనీల్లో త్వరలోనే ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేయనున్నారు.  ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరనున్నారు. 

అడవుల పెంపకంపై ప్రత్యేక దృష్టి..

యాదాద్రి  తరహా అడవుల పెంపకంపై దృష్టి సారించాం. మల్కాజిగిరి సర్కిల్‌లోని రెండెకరాల్లో ప్లాంటేషన్లు ఏర్పాటు చేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాం. రెండెకరాల్లో 50 వేల మొక్కలు నాటి సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అల్వాల్‌లోని కౌకుర్‌లో ఎకరా స్థలంలో 8 వేల మొక్కలు నాటనున్నాం. హరితహారం కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం.  త్వరలోనే ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేయనున్నాం.

-దశరథ్‌,ఉపకమిషనర్‌, మల్కాజిగిరి.