మెదక్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఎరుకల కులస్తుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తుందని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మెదక్‌లోని మాయగార్డెన్లో ఎరుకల ఆత్మీయ సమ్మేళనానికి పద్మాదేవేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు కులవృత్తులను విస్మరించాయని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కులవృత్తులపై ఆధారపడి జీవించే వారికి సీఎం కేసీఆర్ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రె స్, బీజేపీ నాయకులు చెప్పే మాయమాటలు విని ప్రజలు మోసపోవద్దన్నారు.
అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేశారని తెలిపారు. ఎరుకల కులస్తులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పందుల పెంపకానికి నిధులను కేటాయించిందని, కులస్తులు సొసైటీగా ఏర్పడి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరోసారి ఆడబిడ్డగా ఆశీర్వదించి గెలిపించాలని ఆమె కోరారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో వివరాలను గ్రామాల్లో అర్థమయ్యే రీతిలో వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సమావేశంలో ఎరుకల సంఘం రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, కౌన్సిలర్ ఆంజనేయులు, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు భిక్షపతి, జిల్లా, మండలాల ఎరుకల సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.