చేర్యాల, ఫిబ్రవరి 15: కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైల్వేలకు నిధులు కేటాయింపు విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. గురువారం కొమురవెల్లి మల్లికార్జున స్వామిని మధ్యప్రదేశ్ సీఎం మోహన్‌యాదవ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌తో కలిసి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్నం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ ఈవో బాలాజీ, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి ఆలయ అర్చకులతో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రైల్వే స్టేషన్ నిర్మించనున్న ప్రాంతంలో మధ్యప్రదేశ్ సీఎం, దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ అరుణ్‌కుమార్‌జైన్ తదితరులతో కలిసి కిషన్‌రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మల్లన్న భక్తుల కోసం రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ సహకారంతో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని, కొండ ప్రాంతంలో ఉండడంతో సాంకేతికంగా ఇబ్బందులున్నా ప్రధాని మోదీ ఆదేశాలతో భక్తుల ఆకాంక్ష మేరకు రైల్వేస్టేషన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రధాని మోదీ స్వయంగా మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ ప్రారంభించారని తెలిపారు. తెలంగాణకు రైల్వే కేటాయింపుల్లో కాంగ్రెస్ సర్కారు 2014లో రూ.250 కోట్లు ప్రకటిస్తే, నేడు ప్రధాని మోదీ రూ. 6,000 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి మోదీ ప్రభుత్వం రూ.26వేల కోట్ల నిధులు మంజూరు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా భూమి సేకరిస్తే నిధులు అంత త్వరగా వస్తాయన్నారు. త్రిపుల్ ఆర్ నిర్మాణం పూర్తి కాగానే, దాని చుట్టూ రింగ్ రైల్వేలైన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ప్రధాని మోదీ నేతృత్వంలో భారతీయ రైల్వేలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని, బుల్లెట్ రైల్, వందేభారత్ వంటి అధునాతన రైళ్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు.యావత్తు దేశాన్ని రైల్వే వ్యవస్థ ఒక్కటిగా చేస్తుందని, చైనా సరిహద్దు వరకు రైల్వేలైన్ విస్తరణ జరిగిందన్నారు. వీలైనంత త్వరగా కొమురవెల్లి మల్లన్న రైల్వేస్టేషన్ నిర్మాణం పూర్తవుతుందన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ పాల్గొన్నారు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.100కోట్ల నిధులు మంజూరు చేయించాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్యాదవ్లకు ఆలయ పునరుద్ధరణ కమి టీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, నాయకుడు మహాదేవుని శ్రీనివాస్, కమిటీ సభ్యులు వినతిపత్రం అందజేశారు.