మద్దూరు(ధూళిమిట్ట), మార్చి 2 : దేవుడు కరుణించినా పూజారి వరమివ్వలేదన్న చందంగా మారింది అర్జున్పట్ల, కమలాయపల్లి గ్రామాల పరిస్థితి. ఏండ్ల కల సాకరమైందని నిశ్చింతగా ఉన్న ఆ గ్రామాల ప్రజల పాలిట అధికారుల నిర్లక్ష్య వైఖరి శాపంగా మారింది. మద్దూరు మండల కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్జున్పట్ల, కమలాయపల్లి గ్రామాల ప్రజలు తమను దగ్గరలో ఉన్న చేర్యాల మండలంలో కలపాలని ఏండ్లుగా పోరాటాలు చేశారు.
రెండు గ్రామాల ప్రజాల అభీష్టం మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 డిసెంబర్ 17న ఆ రెండు గ్రామాలను చేర్యాల మండలంలో విలీనం చేసింది. ఈ రెండు గ్రామాల ప్రజలు ప్రస్తుతం చేర్యాల మండలం నుంచి రెవెన్యూ, వ్యవసాయశాఖ, విద్యాశాఖ సేవలను పొందుతున్నారు. మిగతా శాఖల పనుల కోసం ఇప్పటికీ మద్దూరుకు రావాల్సిన పరిస్థితి ఉంది.స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పూర్తిస్థాయిలో చేర్యాల మండలంలో విలీనమవుతామని ఆశించిన ఆ రెండు గ్రామాల ప్రజలకు ప్రభుత్వ తీరుతో నిరాశే మిగిలింది. ఇటీవల ప్రభుత్వం ప్రదర్శించిన ఎంపీటీసీ స్థానాల ముసాయిదాలో అర్జున్పట్ల, కమలాయపల్లి గ్రామాలు మద్దూరు మండల పరిషత్లోనే కొనసాగించడంపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
తమ గ్రామాలను చేర్యాల మండలంలో కలపాలని అర్జున్పట్ల, కమలాయపల్లి గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులను ప్రత్యేకంగా కలిసి వినతి పత్రాలు అందజేశారు. జేసీ, అడిషనల్ కలెక్టర్లకు వినతి పత్రాలను అందజేశారు. ఇటీవల పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను పలువురు గ్రామస్తులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. పంచాయతీరాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ లోకేశ్కుమార్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. తమ గ్రామాలను చేర్యాల మండల పరిషత్లో విలీనం చేయాలని లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరించారు.