బిడ్డ పెండ్లి, ఇతరత్రా అవసరాలకు అప్పులు అయ్యాయి. అప్పులు తీర్చి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని భావించి ఎన్నో ఆశలతో జోర్డాన్ దేశానికి వెళ్లిన భూంపల్లికి చెందిన బొమ్మనమైన పోచయ్యకు కాలం కలిసిరాలేదు. జోర్డాన్ వెళ్లిన ఆయన, అక్కడ ఇబ్బందుల పాలై నరకయాతన అనుభవించాడు. అక్కడ తిండి సక్కగా లేక అతని ఆరోగ్యం క్షీణించింది. చేతిలో చిల్లి గవ్వలేక ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు. ఒక దశలో ఒక ఇంటికి రాలేనని ఆశలు కోల్పోయాడు. మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కృషి, సహకారంతో జోర్డాన్ నుంచి క్షేమంగా సొంతూరికి చేరాడు.
మిరుదొడ్డి (అక్బర్పేట-భూంపల్లి), అక్టోబర్ 25 : సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం భూంపల్లికి చెందిన బొమ్మనమైన (దాసరి) పోచయ్య,కృష్ణవేణి దంపతులకు నలుగురు సంతానం. ఈ దంపతుల కుమారుడు పోచయ్యకు గ్రామంలో ఎలాంటి వ్యవసాయ భూమి లేకపోవడంతో పాత ఇనుప సామాగ్రి సేకరణ వ్యాపారం చేస్తూ కుటుంబంతో కలిసి జీవించేవాడు. రూ.8 లక్షల అప్పు చేసి పెద్ద కుమార్తె శ్రావణి పెండ్లి చేశాడు. భార్య కృష్ణవేణితో పాటు రమేశ్, అంజలి, ప్రసాద్ ముగ్గురు పిల్లలను వదిలి బతుకుదెరువుకు జోర్డాన్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లింగుపల్లికి చెందిన గల్ఫ్ ఏజెంట్ భూపతికి రూ.20 వేలు చెల్లించి 7 సెప్టెంబర్ 2024లో జోర్డాన్ వెళ్లాడు. జోర్డాన్‌లో దేశంలో ఇజ్రాయిల్ సరిహద్దులోని మిలిమియా కంపెనీలో నెలకు వేతనం రూ.240 జేడీలు, భారత కరెన్సీలో నెలకు రూ.25 వేలకు వేతనానికి పనిలో కుదిరాడు. కంపెనీ యజమాని సక్రమంగా ఆహారం అందించేవాడు కాదు.
ఉదయం నుంచి రాత్రి వరకు వెట్టిచాకిరి చేయించుకునేవాడు. పోచయ్యకు బీపీ, షుగర్ బారిన పడడంతో రోజురోజుకు ఆరోగ్యం క్షీణించింది. తనను ఇంటింటి పంపించాలని కంపెనీ యజమానికి వేడుకున్నాడు. రూ.3 లక్షలు చెల్లించి వెళ్లాలని యజమాని సూచించడంతో ఆందోళనకు గురయ్యాడు. చేతిలో చిల్లి గవ్వలేదు, దిక్కుతోచని స్థితి, ఆహారం లేక, ఆరోగ్యం క్షీణిస్తుడండతో ఇండియా ఎంబసీ వద్దకు వెళ్లి తను పడుతున్న ఇబ్బందులను అధికారులకు పోచయ్య విన్నవించాడు. ఎంబసీ అధికారులు కంపెనీ వద్దకు వచ్చి బాధితుడి వివరాలు సేకరించి ఇండియాకు పంపిస్తామని చెప్పి వెళ్లారు. 15 రోజులు గడిచినా ఎలాంటి కబురు రాలేదు. దీంతో ఫోన్లో గూగుల్ ద్వారా ఫోన్ నెంబర్లు సేకరించి తెలంగాణ మంత్రులకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఫోన్‌చేసి గోడు వెల్లబోసుకున్నాడు. వారెవరూ స్పందించి సాయం చేయలేదు.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్కురావుకు ఫోన్ చేయడంతో అతని పీఏ కాల్ లిఫ్ట్ చేశాడు. జోర్డాన్‌లో తాను పడుతున్న కష్టాలను ఆయనకు తెలుపడంతో వెంటనే పీఏ హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే హరీశ్‌రావు ఫోన్ చేసి బాధితుడు పోచయ్యతో మాట్లాడారు. వారం రోజుల్లో తాను మిలిమియా కంపెనీకి డబ్బులు చెల్లించి ఇంటికి చేర్చుతానని భరోసా ఇచ్చాడు. రూ.3 లక్షలతో పాటు స్వగ్రామం భూంపల్లికి రావడానికి అన్ని ఖర్చులను హరీశ్‌రావు భరించి, ఈనెల 23న జోర్డాన్ నుంచి క్షేమంగా రప్పించాడు. భూంపల్లికి చేరిన పోచయ్య భావోద్వేగానికి గురయ్యాడు. హరీశ్‌రావుకు పోచయ్య కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.
నేను జోర్డాన్ దేశం నుంచి తిరిగి ఇంటికి వస్తానని అనుకోలేదు. నాభార్య, పిల్లలను కలుస్తానని అనుకోలేదు. ఒక్క ఫోన్ కాల్‌తో స్పందించి నాకు అండగా నిలిచి మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నన్ను ప్రాణాలతో కాపాడిన నాపాలిట దేవుడు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు. నేను, మా కుటుంబం హరీశ్‌రావును ఎప్పుడూ మర్చిపోం. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– బొమ్మనమైన పోచయ్య, భూంపల్లి (జోర్డాన్ బాధితుడు)