ఝరాసంగం : వసంత పంచమి ( Vasant Panchami ) కేవలం పండుగ మాత్రమే కాకుండా, మానవ జీవితాల్లో జ్ఞాన వసంతాన్ని నింపే పవిత్ర దినమని బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి మహామండలేశ్వర్ సిద్దేశ్వరానంద గిరి ( Siddheshwarananda Giri ) మహారాజు తెలిపారు. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేదే శుభదినమని పేర్కొన్నారు.

శుక్రవారం వసంత పంచమి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టారు. దత్తాత్రేయ మందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.
వసంత ఋతువు ప్రకృతికి పుష్పాలను అందిస్తే, వసంత పంచమి మన జీవితాలకు సద్గుణాలు, సృజనాత్మకతను అందిస్తుందని మహారాజు వివరించారు. ఆలయంలో జరుగుతున్న రాజశ్యామల దేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు సంగారెడ్డి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తుల కోసం ఉత్సవ కమిటీ సభ్యులు అన్నదానం నిర్వహించారు.