కొండపాక(కుకునూరుపల్లి), మార్చి 21: తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి డీ4 కెనాల్ ద్వారా కొండపాక మండలంలోని రైతులకు సాగునీరు అందించాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు సిద్దిపేట కలెక్టరేట్లో డీఆర్వోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. డీ4 కెనాల్‌కు సాగునీళ్లు వదలకపోవడంతో కొండపాక మండలంలో డీ4 కెనాల్ ఆయకట్టులో 10 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు.
అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, వినతి పత్రాలు సమర్పించినా చుక్కనీరు వదలక పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మెయింటెన్స్‌కు రూ.6 కోట్ల నిధులు అవసరమని, ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో పంపులు స్టార్ట్ చేయలేకపోతున్నామని అధికారులు చెబుతున్నట్లు తెలిపారు. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమని విమర్శించారు.
మల్లన్నసాగర్ నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు కాలువ పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేసి పరిసర గ్రామాల ప్రజలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రం దివాలా తీసిందన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ అనంతులు అశ్వినీప్రశాంత్, మాజీ ఎంపీపీ ర్యాగల సుగణదుర్గయ్య, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నూనె కుమార్‌యాదవ్, మాజీ ఎంపీపీ రాధాకృష్ణారెడ్డి, నాయకులు జైపాల్‌రెడ్డి, పలు గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.