నంగునూరు, సెప్టెంబర్ 20 : ‘సిద్దిపేట జిల్లా పీఠభూమిలో ఎత్తయిన స్థానంలో ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కేంద్ర స్థానంలో సిద్దిపేట ఉంది. అందుకే ఇక్కడ ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. ఎకడి నుండైనా సులభంగా ఇక్కడికి ఆయిల్‌పామ్ గెలలను రవా ణా చేయవచ్చు. రాబోయే రెండు, మూడేండ్లలో 6 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుచేసి దేశంలోనే నెంబర్ వన్‌గా తెలంగాణను నిలపాలి. తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలవాలనేది మా ఆకాం క్ష’.. అని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెట్ట గ్రామంలో నిర్మించిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని శనివారం ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో కలిసి మంత్రి సందర్శించారు. డ్రైరన్‌ను తిలకించి ముడి పామాయిల్ ఉత్పత్తిని పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు మాట్లాడుతూ… ఆయిల్‌పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని సూచించారు. ప్రపంచస్థాయి టెక్నాలజీని వినియోగించుకొని దేశంలో మొదటి స్థానంలో నిలిచేలా నర్మెట్టలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని నిర్మించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
త్వరలోనే సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించి, ఫ్యాక్టరీ వద్ద రాష్ట్రంలోని లక్షమంది ఆయిల్‌పామ్ రైతులతో సభ నిర్వహిస్తామని తెలిపారు. ఎలాంటి పొల్యూషన్ రాకుండా పామాయిల్ గింజల పిప్పితో 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. కరెంటు ఇబ్బంది కూడా ఫ్యాక్టరీకి ఉండదన్నారు. గింజల నుంచి కూడా ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యానవన శాఖ రాష్ట్ర డైరెక్టర్, కలెక్టరు, అధికారులతో సమన్వయం చేస్తూ మండలాల వారీగా ఆయిల్‌పామ్ తోటల పెంపకం టార్గెట్ నిర్దేశించి, దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్ స్థానంలో నిలిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటలుగా కోకో, జాజి లాంటి పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. దిగుబడి తగ్గకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉద్యానవన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ రైతులకు సూచనలు, సలహాలు అందించాలని మంత్రి ఆదేశించారు. మంత్రి వెంట వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, ఉద్యానవన శాఖ రాష్ట్ర డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాష, జిల్లా కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ఆయిల్‌ఫెడ్ ఎండీ శంకరయ్య, జిల్లా ఉద్యానశాఖ అధికారి సువర్ణ, ఆయిల్ ఫెడ్, ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.