గజ్వేల్ రూరల్, డిసెంబర్ 12 : రాష్ట్ర అభివృద్ధిలో క్షణక్షణం బిజీబిజీగా గడుపుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటునే సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్న రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ప్రస్తుతం నిరుద్యోగుల బంగారు భవిష్యత్ కోసం ఆయన చేస్తున్న కృషికి ఫలితం దుక్కుతున్నది. ఉద్యమంలో తన వెంట నడిచిన ఎంతో మంది నిరుద్యోగులకు అండగా నిలబడి 2018, 2022లో విడుదలైన పోలీస్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం పోటీ పడుతున్న అభ్యర్థులకు సొంత ఖర్చులతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉచితంగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయించి శిక్షణ ఇప్పిస్తుండడంతో ఎంతో మంది పోలీస్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించారు. ప్రస్తుతం జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉచిత శారీరక దారుఢ్య శిక్షణలో చాలా మంది అభ్యర్థులు పాల్గొంటున్నారు. మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు కొనసాగుతుండగా పోలీస్ అధికారుల పర్యవేక్షణలో నడుస్తున్నాయి.
90 రోజుల ఉచిత శిక్షణ..
మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఉచిత పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై, గ్రూప్స్ పరీక్షల కోసం 90రోజుల పాటు సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల ప్రాంతాల్లో శిక్షణ అందించారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో అనుభవజ్ఞులైన కోచింగ్ సెంటర్ల అధ్యాపకులతో శిక్షణ ఇప్పించి స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. 90రోజుల పాటు ఇచ్చిన శిక్షణలో జిల్లా వ్యాప్తంగా సుమారు 1034మంది వరకు శిక్షణ తీసుకున్నారు. వీరికి మధ్యాహ్న భోజనంతో పాటు సాయంత్రం స్నాక్స్‌ను అందజేశారు. జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, చేర్యాలలో 1034 మంది శిక్షణ తీసుకోగా, ఇందులో 534 మంది పోలీస్ ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించారు. అర్హత సాధించిన వారికి ఆయా ప్రాంతాల్లో శారీరక దారుఢ్య శిక్షణ ఇప్పిస్తుండగా, ప్రస్తుతం 700పై చిలుకు మంది అభ్యర్థులు పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పరీక్ష కోసం శిక్షణలో పాల్గొంటున్నారు. వీరితో పాటు గ్రూప్స్ శిక్షణ కూడా చాలా మంది అభ్యర్థులకు ఇచ్చారు.
అభ్యర్థులకు పాలు, పండ్లు, గుడ్డు..
సిద్దిపేటలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై శారీరక దారుఢ్య శిక్షణలో పాల్గొంటున్న అభ్యర్థులకు మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ప్రతిరోజు శిక్షణ ముగియగానే, వారికి పాలు, అరటిపండ్లు, గుడ్డును అందజేస్తున్నారు. ఇక గజ్వేల్, చేర్యాల, దుబ్బాక ప్రాంతాల్లో శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు గుడ్డు, అరటిపండ్లను అందజేస్తున్నారు. డిసెంబర్ మాసంలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు శారీరక పరీక్ష నిర్వహించే అవకాశాలుండడంతో ప్రతిరోజు తెల్లవారుజామునే మైదానానికి చేరుకునే వారికి అనుభవజ్ఞులైన పీఈటీతో పురుష అభ్యర్థులకు 1600మీటర్ల రన్నింగ్, షాట్‌పుట్, లాంగ్‌జంప్, మహిళా అభ్యర్థులకు 800మీటర్ల రన్నింగ్, షాట్‌పుట్, లాంగ్‌జంప్‌పై శిక్షణ ఇస్తున్నారు.
సిద్దిపేటలో మహిళ అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ శిబిరం
సిద్దిపేట పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్లో పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల కోసం శారీరక శిక్షణ శిబిరాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 150మంది మహిళలకు ప్రతి రోజు 800మీటర్ల రన్నింగ్, షాట్‌పుట్, లాంగ్‌జంప్‌పై శిక్షణ ఇచ్చారు.
45 రోజుల ఫైనల్ శిక్షణ తరగతులు
ప్రిలిమినరీ, ఫిజికల్ టెస్టులో అర్హత సాధించే వారి కోసం ప్రత్యేకంగా చివరిదైన ఫైనల్ పరీక్ష కోసం 45 రోజుల పాటు మరో దఫా శిక్షణను అందించనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష కోసం తీసుకున్న శిక్షణ ఫైనల్ పరీక్షకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫైనల్ పరీక్ష కోసం అనుభవజ్ఞులైన వారితో సిద్దిపేటతో పాటు ఇతర ప్రాంతాల్లో శిక్షణ అందించనున్నారు.
2018లో 158మందికి ప్రభుత్వ ఉద్యోగాలు..
2018లో వెలుబడిన ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకొని మంత్రి హరీశ్‌రావు జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక ప్రాంతాల్లో ఉచితంగా శిక్షణ ఇప్పించారు. మంత్రి హరీశ్‌రావు ఇప్పించిన ఉచిత శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకొని శిక్షణ తీసుకున్న వారిలో 158మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇందులో ఎనిమిది మంది ఎస్సైలు కాగా, 150 మందిలో పోలీస్ కానిస్టేబుల్, అటవీ బీట్, సెక్షన్, ఫైర్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలుగా వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు. పోలీస్ అధికారుల పర్యవేక్షణలో ప్రతి రోజు శిక్షణ కొనసాగుతుంది.
గ్రామీణ ప్రాంతవాసులకు అండగా..
జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు అండగా మంత్రి హరీశ్‌రావు నిలబడ్డారు. ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాల సాధన కోసం సరైన గైడెన్స్ లేక ఆర్థిక సమస్యలతో చాలా మంది యువతియువకులు జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. అలాంటి వారికి దిశానిర్దేశం చేసి వారి భవిష్యత్‌ను బంగారుమయం చేసేందుకు మంత్రి హరీశ్‌రావు కార్యాచరణను అమలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద తల్లిదండ్రులు వారి పిల్లలను ఉద్యోగాల సాధన కోసం శిక్షణ ఇప్పించలేని పరిస్థితులను చూసి సొంత ఖర్చులతో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయించారు.
ఉచిత శిక్షణతోనే క్వాలిఫై అయ్యా..
మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో గజ్వేల్‌లో ఇప్పించిన ఉచిత శిక్షణతోనే నేను పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ప్రిలిమినరీ పరీక్షల్లో క్వాలిఫై అయ్యా. త్వరలో నిర్వహించే శారీరక దారుఢ్య పరీక్ష కోసం ప్రతిరోజూ గ్రౌండ్లో ఇస్తున్న ఉచిత శిక్షణకు హాజరవుతున్న. తప్పకుండా అన్నింట్లో అర్హత సాధిస్తా. పోలీస్ ఉద్యోగం పొందుతా. నిరుద్యోగుల కోసం తపిస్తు సొంత ఖర్చులతో శిక్షణ ఇప్పిస్తున్న మంత్రి హరీశ్‌రావుకు రుణపడి ఉంటాం.
– జీవన్, సింగాటం
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకున్నా..
గజ్వేల్‌లో ఉద్యోగాల నియామకం కోసం మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఇస్తున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుంటున్న. నేను కానిస్టేబుల్, ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయ్యా. ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో చదువుతున్న. తప్పకుండా పోలీస్ ఉద్యోగం సాధిస్తా. ఉచిత శిక్షణ తీసుకున్న చాలా మంది నా స్నేహితులు క్వాలిఫై అయ్యారు. ఎక్కువ సంఖ్యలో పోలీస్ ఉద్యోగాలు సాధించేలా అందరికి ఉచిత శిక్షణ తోడ్పాటునందిస్తుంది.
– యాదగిరి, తిమ్మాపూర్