పటాన్చెరు రూరల్, జూలై 31: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో ఇంద్రేశం కేంద్రంగా మరో కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి గెజిట్ విడుదల చేసింది. ఇంద్రేశం మేజర్ గ్రామ పంచాయతీగా ఉంది. ఇంద్రేశం కేం ద్రంగా చేస్తూ బచ్చుగూడెం, ఐనోల్, రామేశ్వరంబండ, పెద్ద కంజర్ల, చిన్న కంజర్లతో కలపి మొత్తం ఆరు గ్రామాలతో మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం గెజిట్ను జారీ చేసింది. రింగురోడ్డుకు కూతవేటు దూరంలో ఉన్న ఇంద్రేశం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది.
ఇంద్రేశంతో పాటు విలీనం చేయబడుతున్న ఐదు గ్రామాలు చిన్న పంచాయతీలు. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆరు పంచాయతీలను మున్సిపాలిటీలుగా చేస్తున్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో రుద్రారం, లక్డారం గ్రామ పంచాయతీలను విలీనం చేశారు. చిన్న పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడంపై ఆయా గ్రామాల ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
పన్నుల భారం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం పెంచకుండానే వారిని మున్సిపాలిటీల్లో చేర్చడంతో ఒనగూరే ప్రయోజనాలేమి ఉండవని ప్రజలు వాపోతున్నారు. పారిశుధ్యం, తాగునీటి సరఫరా, ఇతర సేవ లు గ్రామ పంచాయతీల్లోనే బావున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పటాన్చెరు మండలంలో మున్సిపాలిటీలుగా మారిన ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారంలలో పౌర సేవలు, మౌలిక వసతుల కల్పనలో విఫలం చెందుతున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి.
తెల్లాపూర్ మున్సిపాలిటీలో విలీనమైన ముత్తంగి, పోచారం, పాటి, ఘనపూర్, కర్ధనూర్లోనూ మున్సిపాలిటీ సేవలు అంతంతమాత్రంగానే మారాయి. ఈ మున్సిపాలిటీలు పారిశుధ్యం, తాగునీటి సరఫరాలో ఘోరంగా విఫలమయ్యాయి. పటాన్చెరు మండలాన్ని ఖండఖండాలుగా ముక్కలు చేసి మూడు మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. పటాన్చెరు మండ లం ఒకప్పుడు 29 గ్రామాలతో పెద్ద మండలంగా ఉండేది. ఆరేండ్ల్ల క్రితం దానిని అమీన్ఫూర్ మం డలంగా విడదీశారు.
ఇప్పుడు అమీన్ఫూర్ మండలం కూడా మున్సిపాలిటీగా మారింది. ఒకప్పుడు ఒక మండలంగా ఉన్న పటాన్చెరు మండలం ఇప్పుడు నాలుగు మున్సిపాలిటీలుగా మారాయి. పాలనాపరమైన విభజన అవసరమనుకుంటే ఆ స్థాయి సేవలు విస్తరించాలి. ఇప్పటికే మున్సిపాలిటీల్లోని టౌన్ ప్లానింగ్, ఇతర విభాగాల్లోని అధికారులకు రెండు, మూడు మున్సిపాలిటీల బాధ్యతలు అప్పగించారు. సిబ్బంది, వనరులు, ఆఫీసులు, ఆ స్థాయి జనాభా లేకుండానే మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేస్తుండడం విమర్శలకు తావిస్తున్నది.
భానూర్, నందిగామ, క్యాసారం ప్రశ్నార్థకం
పటాన్చెరు మండలంలోని భానూర్, నందిగామ, క్యాసారం గ్రామ పంచాయతీలు మాత్రం ఏ మున్సిపాలిటీల్లో విలీనం కాలేదు. ముం దుగా ఇస్నాపూర్లో మూడు గ్రామాలు విలీనం అవుతాయన్నారు. అధికారుల ప్రతిపాదనలు కూడా చేశారు. కానీ, గెజిట్లో ఈ మూడు గ్రామాలను వదిలేశారు. వీటిని వదిలేస్తే మండలంలోని అన్ని గ్రామాలు ఏదో ఒక మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. భానూర్, నందిగామలోని నేతలు పైరవీలు చేసుకుని రెండు గ్రామాలను విలీనం చేయకుండా అడ్డుకున్నారని ప్రచారంలో ఉంది.
మండల వ్యవస్థ కొనసాగేందుకు క్యాసారం గ్రామాన్ని కలుపుతారని తెలిసింది. భానూర్లో మూడు ఎంపీటీసీలు, నందిగామలో ఒక ఎంపీటీసీ, క్యాసారంలో ఒక ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఐదు ఎంపీటీసీ స్థానాలతో ఒక ఎంపీపీ, ఒక జడ్పీటీసీ, ఒక వైస్ ఎంపీపీ పాలన ఉండేలా ప్లాన్ చేశారు.
మండల ప్రజాప్రతినిధులుగా చేసిన వ్యక్తులకే రెండు చాన్స్ ఇస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. ఇద్దరు నాయకుల కుటుంబాలకే ఐదేండ్లు పవర్ ఉండేలా ప్లాన్ చేశారని చర్చ జరుగుతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం బీడీఎల్ పరిశ్రమ సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి, అంత త్వరగా అనుమతులు రావని ప్రచారం చేస్తున్నారు. మూడు గ్రామాల భవిత అతి త్వరలో తేలనున్నది.