నియోజకవర్గాల వారీగా లబ్ధిదారుల గుర్తింపు పూర్తి
350 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించిన అధికారులు
నచ్చిన యూనిట్లను ఎంపిక చేసుకున్న లబ్ధిదారులు
అత్యధికంగా డెయిరీ యూనిట్ల ఏర్పాటుకు మొగ్గు
రూ.14.50 కోట్ల నిధులను విడుదల చేసిన ప్రభుత్వం
సంగారెడ్డి మార్చి 12, నమస్తే తెలంగాణ : దళితులను ఆర్థికంగా వృద్ధిలోకి తెచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం సంగారెడ్డి జిల్లాలో గ్రౌండింగ్‌కు సిద్ధమైంది. ఈనెల 31లోగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ కావడంతో ఆ దిశగా చర్యలు ముమ్మరం చేశారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి వంద మంది చొప్పున 444 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, వీరిలో 350 మందికి ఇంటర్వ్యులు నిర్వహించారు. ఒక్కో లబ్ధిదారుడికి ప్రభుత్వం రూ.10లక్షలను కేటాయిస్తున్న నేపథ్యంలో డెయిరీ, క్లాత్ ఎంపోరియం, డయాగ్నస్టిక్ ల్యాబ్, డిజిటల్ ఫొటో స్టూడియో, డీటీపీ సెంటర్, ఎలక్ట్రికల్, హార్డ్‌వేర్ షాపులు, హోటల్, క్యాటరింగ్ తదితర యూనిట్లు నెలకొల్పేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా మొత్తం లబ్ధిదారుల్లో 143 మంది డెయిరీ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలో సమావేశాలు ఏర్పాటు చేయగా, వ్యాపార నిర్వహణపై అధికారులు నిపుణులతో అవగాహన కల్పించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ‘దళితబంధు’ గ్రౌండింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళితబంధు పథకం గ్రౌం డింగ్ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ నెల 31వ తేదీలోగా సంగారెడ్డి జిల్లాలో గ్రౌండింగ్ పూర్తి చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధం అవుతుంది. సంగారెడ్డి జిల్లాలో దళితబంధు పథకం కింద 444మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. దళితబంధు పథకం మొదటి విడుతలో ప్రతి నియోజకవర్గం నుంచి వందమంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒక్కో లబ్ధిదారుడికి ప్రభుత్వం రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందజేయనుంది. ఈ డబ్బులతో లబ్ధిదారులను తమకు నచ్చిన యూనిట్లను ఎంపిక చేసుకోవచ్చు. పథకం అమలు కోసం ప్రభుత్వం రూ. 14.50కోట్ల నిధులను విడుదల చేసింది. ఇదిలా ఉంటే ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఇటీవలే దళితబందు పథకం అమలుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దళితబంధు పథకాన్ని మార్చి 31లోగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు.
సం గారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పరిధిలో ఎంపికైన లబ్ధిదారులతో సమావేశం అయ్యారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్ల గురించి వారితో చర్చించారు. ఆ తర్వాత జిల్లా అధికారులు సైతం లబ్ధిదారులతో సమావేశమై ఇంటర్వ్యూ చేశారు. యూనిట్లు నచ్చని పక్షంలో వాటిని మార్చుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. శనివారం వరకు జిల్లా అధికారులు 350మంది లబ్ధిదారులను ఇంటర్వ్యూలు చేసినట్లు తెలిపారు. ఎంపికైన లబ్ధిదారులు ఎక్కువ గా డెయిరీ యూనిట్ల ఏర్పాటుకు మొగ్గుచూపుతున్నారు. అలాగే రవాణా వాహనాలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో అధికారులు శుక్రవారం వివిధ కంపెనీలకు సంబంధించిన ట్రాక్టర్లు, ఆటోలు ఇతర రవాణ వాహనాలను కలెక్టరేట్లో ప్రదర్శించారు. ఆయా కంపెనీల డీలర్లతో లబ్ధిదారులతో మాట్లాడారు. లబ్ధిదారులు తమకు నచ్చిన కంపెనీకి సం బంధించిన నచ్చిన వాహనం కొనుగోలు చేసే అవకాశం ప్రభుత్వం కల్పిస్తున్నది. దీంతో లబ్ధిదారులు కొంతమంది తమకు నచ్చిన వాహనాలను ఎంపిక చేసుకుని వివరాలను అధికారులకు అందజేశారు.
డెయిరీ ఏర్పాటు వైపు అత్యధికులు మొగ్గు
దళితబందు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులు ఎక్కువ మంది డెయిరీ యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. మొత్తం 444మంది లబ్ధిదారుల్లో 143మంది డెయిరీ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చారు. ప్రభుత్వం డెయిరీ ఏర్పాటు చేసుకునే లబ్ధిదారులను ప్రోత్సహిస్తున్నది. రూ. 10లక్షలతో గేదెలను కొనుగోలు చేయటంతో పాటు ఈజీఎస్ నిధులతో షెడ్ వేసుకునే సౌలభ్యం కల్పిస్తున్నది.
డెయిరీ ఏర్పా టు చేసుకునే లబ్ధిదారుల నుంచి విజయడెయిరీ పాలు సేకరించే లా జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 26మంది, జహీరాబాద్‌లో 35, పటాన్చెరులో 32, నారాయణఖేడ్‌లో 33, అందోలు నియోజకవర్గంలో 17మంది లబ్ధిదారులు మినీడెయిరీ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. అలాగే రవాణా వాహనాల కొనుగోలుకు 80మంది, ట్రాక్టర్ 25మంది, ట్రాక్టర్ ట్రాలీల 19మంది, సెంట్రింగ్ దుకాణం 25మంది, పౌల్ట్రీఫామ్ 27మంది ఏర్పాటుకు ముందుకు వచ్చారు. వీటితో పాటు క్లాత్ ఎంపోరియం, సిమెంట్ షాపు, వాటర్‌బాటిల్ ప్లాంటు, ఫుట్‌వేర్ ఇతర వేర్వేరు దుకాణాలు పెట్టుకునేందుకు లబ్ధిదారులు ముందుకు వచ్చారు.
మొత్తం 444మందికి 350మంది లబ్ధిదారులతో వ్యవసాయ, పశుసంవర్థకశాఖ జిల్లా అధికారులు, ట్రాన్స్‌పోర్టు కమిషనర్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, జిల్లా ఉద్యానవనశాఖ అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించి వారు ఎంపిక చేసుకున్న యూనిట్ల గురించి చర్చించారు. యూనిట్లు ఏర్పాటు చేసుకున్న తర్వాత లాభసాటిగా ఎలా నడపాలన్న అంశం గురించి దళితబంధు లబ్ధిదారులకు ఇటీవల నిపుణులతో అవగాహన కల్పించారు. యూనిట్ల గ్రౌండింగ్ అంతా సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత దళితబంధు పథకం గ్రౌండింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.