సిద్దిపేట మండలం రాఘవాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ ఈనెల 5న బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యుత్ సబ్‌స్టేషన్‌లోని లాగ్ బుక్‌ను పరిశీలించారు. ఆ సమయంలో వ్యవసాయ రంగానికి కేవలం 10 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతున్నట్లు రికార్డయ్యింది. మొత్తంగా రోజుకు సరాసరిగా 10 నుంచి 12 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వచ్చే కరెంట్ కూడా తరుచూ ట్రిప్ అవుతున్నది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉన్నట్లు గమనించారు. కరెంట్ సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నామని రైతులు ఎమ్మెల్యే హరీశ్‌రావుకు మొరపెట్టుకున్నారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఈనెల 4న విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులు, అఖిల పక్షం నాయకులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అప్రకటిత విద్యుత్ కోతలకు నిరసనగా ఫ్లకార్డులతో నిరసన ప్రదర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ సమస్య రోజురోజుకూ జఠిలమవుతున్నదని రైతులు ఆరోపించారు. అక్కన్నపేట మండలంలో పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఇలా సిద్దిపేట జిల్లాలోని అన్ని మండలాల్లో కరెంట్ కోతలపై రైతులు మండిపడుతున్నారు.
సిద్దిపేట, ఆగస్టు 20: (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యుత్ సమస్యలు నెలకొన్నాయి. అప్రకటిత విద్యుత్ కోతలతో తరుచూ మోటర్లు కాలుతున్నాయి. పెట్టుబడుల భారం.. ప్రకృతి పరిస్థితుల అనిశ్చితి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం.. ఇలా రైతులపై ఒత్తిడి పెరుగుతున్నది. పంటకు నీళ్లు లేకపోతే రైతు పెట్టుబడి నేలపాలవుతుంది. ఉమ్మడి జిల్లాలో విద్యుత్ కష్టాలు రైతాంగాన్ని వెంటాడుతున్నాయి. పంటలకు నీరు అందించేందుకు బోర్లు, వ్యవసాయ మోటర్లపై ఆధారపడుతున్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు.
రోజుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఉత్త మాటే అయ్యిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 10 నుంచి 12 గంటలు మాత్రమే కరెంట్ వస్తున్నదని, అది కూడా తరుచూ ట్రిప్ అవుతున్నదని రైతులు వాపోతున్నారు. సిద్దిపేట జిల్లాలో 1,73,530, మెదక్ జిల్లాలో 1,09,152 సంగారెడ్డి జిల్లాలో 1,06,061 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందింది. దీంతో రాత్రింబవళ్లు మోటర్లు నడుపుకొనే అవకాశం లభించింది. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం ఎందుకు ఇవ్వడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.

Medak1
కరెంట్ కోసం ఎదురుచూపులు
వానలు సమయానికి పడకపోతే బోర్లు, బావులు, వ్యవసాయ మోటర్లే రైతులకు ప్రధాన ఆధారం. ఆ సమయంలో విద్యుత్ అప్రకటిత కోతలు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. విద్యుత్ సరఫరా సక్రమంగా లేక అర్ధరాత్రి, అపరాత్రి రైతులు పొలాలకు వెళ్లాల్సి వస్తున్నది. కొన్ని సార్లు పొలాల వద్దే నిద్ర పోవాల్సిన పరిస్థితి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొని పెట్టుకున్నా సరైన సమయంలో విద్యుత్ సరఫరా లేక నీళ్లు మొక్కలు వాడి పోతుంటే రైతుల బాధలు వర్ణనాతీతం. వరి, పత్తి, కూరగాయలు, ఇతర నీటి ఆధారిత పంటలకు విద్యుత్ సరఫరా అంతరాయం దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
పది గంటలు కూడా కరెంట్ రావడం లేదు
వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రోజుకు కనీసం 10 గంటలు కూడా విద్యుత్ అందడం లేదు. విద్యుత్ వచ్చినా తరుచూ ట్రిప్పింగ్, ఓల్టేజీ హెచ్చుతగ్గులు, అకస్మాత్తుగా సరఫరా నిలిచిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని రైతులు చెబుతున్నారు. దీంతో మోటర్లు కాలిపోవడం, మరమ్మతుల కోసం అదనపు ఖర్చు చేయాల్సి వస్తున్నదని, ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు పెరిగాయని రైతులు వాపోతున్నారు. విద్యుత్ సరఫరాపై సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాల్సిన అవసరం ఉన్నది.