గుమ్మడిదల, సెప్టెంబర్ 21: వసతి గృహం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ భవనాన్ని వదిలి అద్దెభవనంలో చేరారు. తీరా అద్దె భవనంలో వసతులు లేకపోవడంతో హాస్టల్ విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. అద్దె భవనంలో 5 గదులు మాత్రమే అద్దెకిచ్చారు. ఇందులో ఒక గది కార్యాయలం, స్టోర్ గది కావడంతో ఉన్న నాలుగు గదుల్లో 70 మంది విద్యార్థులు ఇబ్బందుల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో ఉన్న ఎస్సీబాలుర వసతి గృహం పరిస్థితి వర్ణాతీతం. గుమ్మడిదలలో ఎస్సీబాలుర వసతి గృహం చాలా ఏండ్ల క్రితం నిర్మించారు.
మూడు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు వసతిగృహంలో విద్యను అభ్యసిస్తున్నారు. వసతి గృహం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారడంతో గుమ్మడిదలలోని బీఎస్ఎన్ఎల్ భవనంలో అద్దెకు తీసుకున్నారు. ఇందులో 5 గదులు మాత్రమే అద్దెకిచ్చారు. ఇందులో ఒక గది కార్యాలయం, స్టోర్కు వినియోగిస్తుండగా, మిగిలిన నాలుగు గదులు విద్యార్థులకు సరిపోవడం లేదు. ఇందులోనే రాత్రివేళలో నిద్రిస్తున్నారు. సరైన వసతులు లేక నేలపైనే నిద్రిస్తున్నారు.
బీఎస్ఎన్ఎల్ భవనంలో రెండు మూత్రశాలలు,మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. నిత్యం కాలకృత్యాలు తీర్చుకోవడానికి విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. తాగునీటి తిప్పలు వేధిస్తున్నాయి. వానలకు గదులన్నీ వర్షపు నీటితో తడిసిపోతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమ లు, ఈగలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నాలు గు గదుల్లోని భోజనశాల, అభ్యాసగదులు..70 మంది విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు.
అధికారులు స్పం దించి ఎస్సీ హాస్టల్కు కొత్త భవనాన్ని నిర్మించాలని విద్యార్థులు, స్థానిక నాయకులు కోరుతున్నారు. ఉన్న అద్దెభవనం నుంచి పాఠశాలలకు వెళ్లాలంటే 1.5 కిలోమీటర్లు నడిచి పోవాల్సి వస్తున్నది. గుమ్మడిదల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో స్థలాన్ని కేటాయించి భవనాన్ని నిర్మిస్తే కష్టాలు తొలుగుతాయని విద్యార్థులు కోరుతున్నారు.