వెల్దుర్తి, ఏప్రిల్ 28: మహిషాసురమర్ధిని శ్రీగోనెమైసమ్మ అమ్మవారి జాతర వెల్దుర్తిలో కనుల పండువగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వెల్దుర్తి, చర్లపల్లి, శేరీ, ఎలుకపల్లి గ్రామాలకు చెందిన మహిళలు, భక్తులు డప్పుచప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, పటాకులు కాల్చుతూ వైభవంగా బోనాలను ఊరేగించి, అమ్మవారి సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. వెల్దుర్తి పట్టణ యువకులు ఫలహారం బండి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతాలక్ష్మారెడ్డి శుక్రవారం గోనెమైసమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించి, మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఏడేండ్లకు ఒకసారి నిర్వహించే ఈ గోనెమైసమ్మ జాతర ఎంతో ప్రాచుర్యం పొందిందన్నారు. అమ్మవారి దీవెనలతో ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. సునీతాలక్ష్మారెడ్డి వెంట సర్పంచ్ భాగ్యమ్మఆంజనేయులు, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు అశోక్‌రెడ్డి, నాయకులు నర్సింలు, శేఖాగౌడ్, ఆంజనేయులుతో పాటు పలువురు నాయకులున్నారు.