ఓటరు జాబితా సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో ఫారాలు నింపే విషయంలో తీవ్ర అయోమయం నెలకొన్నది. దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చే ప్రజలు ఏ ఫారం ఏ అవసరానికి ఉపయోగించాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు)లకు అన్ని అంశాలపై పూర్తి అవగాహన లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పేరు చేర్పు, పేరు తొలిగింపు, చిరునామా మార్పు, వివరాల సవరణ వంటి అంశాలకు వేర్వేరు ఫారాలు ఉండటంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఒకే సమస్యకు వేర్వేరు గ్రామాల్లో వేర్వేరు విధానాలు అనుసరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కొన్నిచోట్ల ఒకే రకమైన దరఖాస్తుకు భిన్నమైన పత్రాలు అడుగుతుండగా, మరికొన్ని చోట్ల అసలు ఏ పత్రాలు అవసరమో స్పష్టత కరువైందని ప్రజలు పెదవి విరుస్తున్నారు.
సిద్దిపేట, జూలై 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి): బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ వో)లకు తగిన శిక్షణ, స్పష్టమైన మార్గదర్శకాలు అం దించకుండానే క్షేత్రస్థాయిలో ఓటరు జాబితా సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ చేపడుతుండడంతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఫారాలు తిరసరణకు గురికాకుండా ఎలా నింపాలి, ఏ ఆధారాలు జతచేయాలి అనే విషయాలపై గ్రామ, పట్టణ స్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదు. దీంతో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. చిన్నచిన్న సందేహాలకు సరైన సమాధానాలు ఇచ్చేవారు కరువయ్యారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ (సర్) సజావుగా సాగాలంటే బీఎల్వోలకు సమగ్ర శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రతి గ్రామంలో స్పష్టమైన సూచనలు, అవసరమై న పత్రాల జాబితా అందుబాటులో ఉంచితే బాగుండేది. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలు గందరగోళంగా ఉన్నాయి. కొత్తగా వివాహామై అత్తగారింటికి వచ్చిన వారికి దరఖాస్తులు నింపడంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బీఎల్ఓలు, పీపీ లు గ్రామాలు, పట్టణ వార్డుల్లో ప్రతి ఓటరు ఇంటిని మూడుసార్లు సందర్శించడం, ఎన్యుమరేషన్ ఫామ్‌ను ఓటర్లు నింపేలా చూడటం, ఓటర్లు స్థానికంగా లేకపోతో ఫోన్లు చేయాల్సి ఉంటుంది. మెజార్టీ గ్రామాలు, వార్డుల్లో ఈ ప్రక్రియ సాగడం లేదు. దీంతో ఓటర్లు తమ ఓటు ఎస్ఐఆర్లో తొలిగిపోతుందేమోననే ఆందోళన చెందుతున్నారు. చాలా కుటుంబాలకు గ్రామాలు, పట్టణాల్లో ఓట్లు ఉండడం, 2002 ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడంతో కొంత ఇబ్బంది ఏర్పడుతున్నది.