ఉగ్రదాడికి ముందే పహల్గాంపై చైనా నిఘా!
గత ఏడాది ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ముందు రోజుల్లో చైనా భూపరిశీలన ఉపగ్రహాలు ఆ ప్రాంతంపై దృష్టి పెట్టేందుకు అసాధారణంగా 37 కక్ష్య మార్పులు చేశాయని బెంగళూరుకు చెందిన అంతరిక్ష నిఘా స్టార్టప్ దిగంతర విశ్లేషణ తెలిపింది.
- దాడికి ఆరు రోజుల ముందు ఆ ప్రాంతంపై నిఘా పెంచేలా ఉపగ్రహ కక్ష్యలో మార్పులు
- దాడికి ముందు, తర్వాత 37 అసాధారణ కదలికలు
- గుర్తించిన అంతరిక్ష సంస్థ దిగంతర
న్యూఢిల్లీ: గత ఏడాది ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ముందు రోజుల్లో చైనా భూపరిశీలన ఉపగ్రహాలు ఆ ప్రాంతంపై దృష్టి పెట్టేందుకు అసాధారణంగా 37 కక్ష్య మార్పులు చేశాయని బెంగళూరుకు చెందిన అంతరిక్ష నిఘా స్టార్టప్ దిగంతర విశ్లేషణ తెలిపింది. దాడి జరిగిన రోజే రెండు ఉపగ్రహాలు ఆ ప్రాంతంపై మరింత తరచుగా దాటివెళ్లేందుకు తమ కక్ష్యలను మార్చుకున్నాయని ది ప్రింట్కు ప్రత్యేకంగా అందిన ఈ నివేదిక పేర్కొన్నది.
అంతరిక్ష పరిధి అవగాహన వ్యవస్థ (ఎస్డీఏ) కింద బెంగళూరుకు చెందిన డిగంతర నిర్వహించిన విశ్లేషణ ప్రకారం.. 2025 ఏప్రిల్ 15 నుంచి 30 వరకు చైనా ఉపగ్రహాలు 37 ముందస్తు ప్రణాళికగా కక్ష్య మార్పులు చేశాయి. దీంతో పహల్గాంపై అవి దాటివెళ్లే సందర్భాలు పెరిగాయి. సాధారణ కక్ష్య మార్గాలకు భిన్నంగా జరిగిన ఈ మార్పులను దాడికి ముందే ప్రణాళిక వేసి ఉండొచ్చని సంస్థ శాస్తవ్రేత్తలు భావించారు. దాడికి కనీసం ఆరు రోజుల ముందే ఈ అసాధారణ కదలికలు మొదలయ్యాయి. ఏప్రిల్ 16న యావోగాన్-35 01ఎ ఉపగ్రహం తన కక్ష్యను మార్చి పహల్గాంపై దాటివెళ్లే సంఖ్యను రెట్టింపు చేసుకున్నది. దాడి రోజున హత్యలు జరిగిన తర్వాత యావోగాన్-39 01బీ, యావోగాన్-39 01సీ ఉపగ్రహాలు సాయంత్రం 5.14 గంటలకు, 5.59 గంటలకు కక్ష్య మార్పులు చేశాయి.
తప్పించుకొనే మార్గాల కోసం…
ఈ కక్ష్య మార్పులకు ఉగ్రదాడితో ఉన్న సంబంధాన్ని నివేదిక నిర్ధారించలేదు. అయితే, భద్రతా దళాల కదలికలను గమనించడానికి లేదా ఉగ్రవాదులు తప్పించుకునే మార్గాలను అంచనా వేయడానికి ఆ ప్రాంతాన్ని ఉపగ్రహాల ద్వారా పర్యవేక్షించి ఉండొచ్చన్న ఊహకు ఇవి సంకేతాలని వర్గాలు తెలిపాయి. అయితే ఇది ధ్రువీకరించని ఊహ మాత్రమే. దాడి తర్వాత కూడా ఈ కదలికలు తగ్గలేదు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో మళ్లీ గరిష్ఠ స్థాయికి చేరాయి. ఎంపిక చేసిన ప్రాంతాన్ని మరింత దగ్గరగా, స్పష్టంగా పరిశీలించేందుకు అనువైన దిగువ భూకక్ష్యలోని చైనా ఉపగ్రహాలు ఏప్రిల్ 29న 37 కక్ష్య మార్పులు, ఏప్రిల్ 30న 31 కక్ష్య మార్పులు చేశాయి. ఉపగ్రహ కక్ష్య మార్పు అంటే.. భూమిపై ఎక్కడ, ఎప్పుడు దాటివెళ్తుందో మార్చేలా ఉపగ్రహ కక్ష్య, దిశ లేదా వేగంలో నియంత్రిత మార్పు చేయడం. ఈ కక్ష్య సర్దుబాట్లతో ఉపగ్రహాలు పహల్గాంపై మరిన్ని సార్లు దాటివెళ్లగలిగాయి. దీంతో ఆ ప్రాంతాన్ని గమనించడానికి వాటికి ఎక్కువ అవకాశాలు లభించాయి.
అమెరికా సంస్థకు అభ్యర్థనలు
2025 ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఉగ్రదాడి జరిగిన నెల తర్వాత పహల్గాం ప్రాంత ఉపగ్రహ చిత్రాల కోసం అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహ సంస్థకు దాడికి కొన్ని వారాల ముందే అభ్యర్థనలు భారీగా పెరిగినట్లు ది ప్రింట్ ప్రత్యేక కథనాల్లో వెల్లడించింది. దాడి ప్రణాళికకు, తర్వాత ఉగ్రవాదులు తప్పించుకునేందుకు ఆ చిత్రాలను ఉపయోగించి ఉండే అవకాశాన్ని అది ప్రస్తావించింది. పాకిస్థాన్ 2025లో తన ఉపగ్రహ కార్యక్రమాన్ని పునరుద్ధరించిందని, 2025 జనవరి నుంచి 2026 జూన్ వరకు 16 నెలల్లో ఆరు ఉపగ్రహాలను ప్రయోగించిందని ది ప్రింట్ గతంలో వెల్లడించింది. వీటిలో ఐదు ప్రయోగాలకు చైనా సహకరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

