చేర్యాల, జూన్ 23 : కొందరు ఉద్యోగులు కొమురవెల్లి మల్లన్న ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. ఆలయంలో కొందరు ఉద్యోగుల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఆలయ ఉద్యోగులు ద్వితీయ శ్రేణి కొన్ని రోజులుగా వివిధ వ్యక్తుల పేరు మీద ఒకరిపై మరొకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఈ నేసథ్యంలో ఆలయ ఉద్యోగుల్లో సఖ్యత కోసం ఈవో బాలాజీ ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఏఈవో గంగా శ్రీనివాస్, ఎలక్ట్రికల్ ఏఈ అంజయ్య మధ్య మాటామాట పెరిగింది. అక్కడే ఉన్న ప్లంబర్ విజయ్ గొడవలో కలుగజేసుకున్నాడు. ఈ క్రమం లో ఏఈ అంజయ్య చెంపను ఏఈవో శ్రీనివాస్ చెల్లుమనిపించాడు. వెంటనే శ్రీనివాస్పైకి అంజ య్య కుర్చి లేపాడు. అక్కడే ఉన్న సహచర ఉద్యోగులు వారిద్దరిని అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆలయ ఈవో బాలాజీ ఇరువురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవ అనంతరం అంజయ్యకు శ్రీనివాస్ క్షమాపణలు చెప్పారు. ఆలయ ఉద్యోగుల మధ్య విబేధా లు తీవ్రస్థాయికి చేరి గొడవ వరకు వెళ్లి రచ్చకెక్కడంతో భక్తులు పెదవి విరుస్తున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.