సిద్దిపేట, ఆగస్టు 4: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆరుగురు ఉపాధ్యాయులను సిద్దిపేట కలెక్టర్ హైమావతి సస్పెండ్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగలోకి వచ్చింది. జూలై 28న కలెక్టర్ సిద్దిపేట పట్టణంలోని మల్టీపర్పస్ హైసూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సదరు ఉపాధ్యాయులు కొంతమంది భోజనానికి ఇంటికి వెళ్లడం, మరికొందరు ఉపాధ్యాయులు టీచింగ్ డైరీ రాయకపోవడం, ఎఫ్ఆర్ఎస్ సరిగ్గా వేయకపోవడం వంటి అంశాలు ఆమె పరిశీలనలో వెలుగులోకి వచ్చాయి.
పాఠశాలలో ఉపాధ్యాయుల తీరుపై సమగ్ర విచారణ చేయాలని డీఈవోకు ఫోన్లో ఆదేశించారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు విధులకు ఆరుగురు ఉపాధ్యాయులు గత నెలలో 10రోజులకు పైగా ఆలస్యంగా వచ్చినట్లు తేలడంతో డీఈవో సదరు నివేదికను కలెక్టర్కు అందజేశారు. దీంతో సిద్దిపేట ప్రభుత్వ మల్టిపర్పస్ హైస్కూల్లో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులు బాలముకుందశర్మ, బాలమణి, రాజేందర్, నికత్ సుల్తానా, అక్బర్ఉన్నీసాబేగం, సుభద్రను సస్పెన్షన్ చేస్తూ సోమవారం కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ చర్య జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.