జిన్నారం, జూలై 30: మండల పరిధిలోని శివనగర్ గ్రామం శివారులోని సర్వేనంబర్ 114లో ఎల్ఈడీ పార్కు కోసం కేటాయించిన 120 ఎకరాల భూమిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కలెక్టర్ శరత్‌తో కలిసి టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహరెడ్డి శనివారం పరిశీలించారు. గ్రామ అవసరాల కోసం ఎల్ఈడీ పార్కు స్థలంలో నుంచి పది ఎకరాలు కేటాయించాలని గ్రామస్తులు వారిని కోరారు. ఈ మేరకు వారు శివనగర్‌లోని ఎల్ఈడీ పార్కు స్థలాన్ని పరిశీలించారు.
గ్రామ అవసరాల కోసం ఐదు ఎకరాలు ఒకచోట, మరో రెండు ఎకరాల స్థలం మరోచోట కేటాయించిన అధికారులు మరో మూడు ఎకరాలు కూడా త్వరలోనే కేటాయిస్తామని చెప్పారు. గ్రామంలో యువజన భవనం, ఆరోగ్య ఉపకేంద్రం, సీసీ రోడ్లు తదితర పనులు చేపట్టాలని గతంలో చేసిన విజ్ఞప్తి మేరకు పనుల ప్రొసీడింగ్స్ సోమవారం ఇస్తామని టీఎస్ఐఐసీ అధికారులు తెలిపారు. అనంతరం శివనగర్ ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు. అక్షయ పాత్ర భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్ విద్యార్థుల శాతం తక్కువగా ఉండడంతో హెచ్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదాశివపేట ప్రాంతంలోని ఓ పాఠశాల హెచ్ఎం విద్యార్థుల కోసం ఇంటింటికీ తిరిగి పాఠశాలలో చేర్పించారని గుర్తు చేశారు. పాఠశాల విద్యార్థులకు టెబుళ్లు, బెంచీలు కావాలని జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్ కలెక్టర్‌ను కోరడంతో తన నిధుల నుంచి రెండు లక్షలతో ఫర్నిచర్ ఇప్పిస్తానని, మిగతావి ఎమ్మెల్యే సహకారంతో పాఠశాలకు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో నగేశ్, తహసీల్దార్ దశరథ్, టీఎస్ఐఐసీ అధికారి భవానీ, సర్పంచులు ఆంజనేయులు, ఖదీర్, నాయకులు కృష్ణ, మహేశ్, ప్రభాకర్‌రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్, కృష్ణాగౌడ్, రామకృష్ణ పాల్గొన్నారు.