రాయపోల్ జనవరి 12 : ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమంగా విక్రయిస్తున్నారని రాయపోల్ ఎస్ఐ కుంచం మానస(SI Manasa) అన్నారు. అంకిరెడ్డిపల్లి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వాహనాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మానస మాట్లాడుతూ శనివారం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో రఘునాథ్ పల్లి నుంచి వడ్డేపల్లికి తరలిస్తున్న డీసీఏం వాహనాన్ని తనిఖీ చేశాం. బియ్యం సంచులను తరలిస్తున్న డ్రైవర్ బానోత్ శంకర్ నాయక్‌ను అదుపులోకి తీసుకొని, వాహనాన్ని పోలీస్ స్టేషన్ తరలించాం. విచారణలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టుగా గుర్తింమని వెల్లడించారు.
పౌర సరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా సోమవారం డీసీఎంలోని బియ్యంను తనిఖీ చేసి రేషన్ బియ్యంగా నిర్ధారించారు. డీసీఎంలోని 52 క్వింటాళ్ల బియ్యంను గోదాంకు తరలించారు. పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ రాజిరెడ్డి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మానస తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కొంతమంది ప్రజల దగ్గర తక్కువ రేటుకు కొని.. అనంతరం ఎక్కువ రేటుకు అమ్మి డబ్బులు సంపాదిస్తున్నారని, అలాంటి వారిపై జిల్లాలో గట్టి నిఘా ఏర్పాటు చేశామని ఎస్ఐ వెల్లడించారు.
అక్రమంగా పిడిఎస్ రేషన్ బియ్యం విక్రయించడం ఈసీ1955 చట్టం సెక్షన్ 7 ప్రకారం నేరమని ఆమె తెలిపారు. రేషన్ బియ్యంను తరలించినందుకు మేకలగూడ గ్రామానికి చెందిన డ్రైవర్ బానోతు శంకర్ నాయక్, బియ్యం కొనుగోలు చేసిన శ్రీకాంత్ నాయక్‌లపై 6 (ఏ) కేసు నమోదు చేశామని చెప్పారు. ఎవరైనా కొనుగోలు చేసిన రేషన్ బియ్యంను ఇతరులు అమ్మిన, అక్రమంగా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మానస హెచ్చరించారు.