Siddipet | మర్కూక్, జూలై18: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నూతనంగా మెనూ అమలు చేయాలని, భోజన నాణ్యతపై రాజీ పడే ప్రసక్తే లేదని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అన్ని శాఖల అధికారులను ఆమె హెచ్చరించారు.
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రంలో శుక్రవారం నాడు కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు, తహసీల్దార్ కార్యాలయం, జడ్పీ హైస్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేయాలని సూచించారు. భోజన నాణ్యతపై రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్.. అక్కడి వైద్య సదుపాయాలను పరిశీలించారు. వైద్య సేవలపై రోగుల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సమీకృత భవనంలో తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయ మార్పు అంశంపై ఉన్నతస్థాయి అధికారులతో చర్చించి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.