సిద్దిపేట, జూన్ 12: కేసీఆర్ పాలనలో యాదవుల సంక్షేమానికి పెద్దపీట వేశామని, యాదవులకు మంత్రి పదవితో పాటు హైదరాబాద్‌లోని కోకాపేట లో ఆత్మగౌరవ భవనం నిర్మించామని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేటలోని శ్రీకృష్ణ యాదవ ఫంక్షన్హాల్లో యాదవ విద్యావంతుల వేదిక ఎంప్లాయీస్ సొసైటీ సహకారంలో యాదవ విద్యార్థులకు ప్రతిభా పురసారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 18 నెలలు గడుస్తున్నా యాదవుల సంక్షేమానికి ఎలాంటి పథకాలు అమలు చేయడం లేదన్నారు.
మంత్రివర్గంలో యాదవులకు అవకాశం కల్పించలేదన్నారు. గొర్రెల పంపిణీ పథకాన్ని బంద్జేసిందన్నారు. వెటర్నరీ దవాఖానల్లో మందులు లేక గొల్లకుర్మలు తమ జీవాలకు వైద్యం చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైనా విద్యాశాఖకు ఇప్పటికీ మంత్రి లేడన్నారు. సర్కారు బడుల బలోపేతం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని రేవంత్ సర్కారు రద్దు చేసిందన్నారు. రేవంత్ సర్కారు ఒక సూల్ భవనం నిర్మించలేదన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వక పోవడంతో నేడు విద్యార్థుల చదువులు ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాదవులు అన్నిరంగాల్లో రాణించాలని, అన్నివిధాలుగా తాను అండగా ఉంటానని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, యాదవ సంఘం నాయకులు పోచబోయిన శ్రీహరి యాదవ్, మామిండ్ల అయిలయ్య, దువ్వల మల్లయ్య యాదవ్, ఫంక్షన్‌హాల్ చైర్మన్ రాములు యాదవ్,కవి ఉండ్రాల రాజేశం,పయ్యవుల శ్యాం యాదవ్, నూనె కుమార్, చింతల మల్లేశం, దాసరి శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.