
సిద్దిపేట అర్బన్, ఆగస్టు 3: జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అధికారి, ప్రజాప్రతినిధి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. మంగళవారం సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్లో చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే రఘునందన్‌రావు, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, జడ్పీ సీఈవో సుమతి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా వ్యవసాయం, వైద్యం ఆరోగ్యం, గృహ నిర్మాణం, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్‌శాఖ, ఆర్అండ్బీ, గ్రామీణాభివృద్ధి, ఉద్యానవన శాఖ, విద్యాశాఖల ప్రగతిపై ఆయా శాఖల అధికారులు సభలో వివరించారు. పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు అడిగిన పలు ప్రశ్నలకు అధికారులు సమాధానమిచ్చారు.
విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత..
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నదని జడ్పీ చైర్పర్సన్ అన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలన్నారు. పేదలకు అత్యంత పారదర్శకంగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నదన్నారు. వివిధ దశల్లో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందించాలని అధికారులను ఆదేశించారు. కరోనా సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉపాధ్యాయులు ఆన్లైన్లో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలన్నారు. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో జిల్లాలో ఆయిల్‌పామ్, సెరీకల్చర్ సాగు విస్తీర్ణం పెరిగేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.
ధరణితో భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం..
భూ సమస్యల పరిష్కారానికి ధరణిలో అన్ని ఆప్షన్లు వచ్చినందున వినతులు, ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని, త్వరలోనే అప్లికేషన్లు పెట్టుకున్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్లు కానీ భూముల అప్లికేషన్లలో భాగంగా వారానికి 2వేల ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రాబోయే రెండు నెలల్లో వారందరికీ న్యాయం చేస్తామన్నారు. జిల్లాలో నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక నెల రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. అర్ధాంతర ప్రభుత్వ కా ర్యాలయాల భవన నిర్మాణాలు పూ ర్తి చేస్తామన్నారు. జిల్లాలో రైతుబంధు పొందుతూ రైతుబీమాలో పేరు చేర్చని వారిని గుర్తించి, త్వరలోనే వివరాలను పొందుపరుస్తామన్నారు. జిల్లాకు 50వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టిందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తూ వచ్చే ఆరు నెలల్లో ప్రతి మండలానికి వెయ్యి ఎకరాల్లో సాగయ్యేలా రైతులను ప్రోత్సహించాలన్నారు.
సభ్యుల ప్రశ్నలు.. అధికారుల సమాధానాలు..
జడ్పీ సమావేశంలో ఎజెండాలోని పలు అంశాలపై అధికారులు ప్రగతి నివేదిస్తుండగా, పలువురు సభ్యులు తమ ప్రశ్నలను అడగగా, అధికారులు సమాధానాలిచ్చారు. రై తుబీమాలో కొందరి పేర్లు నమోదు కాలేదని ఓ సభ్యుడు అడగగా, త్వరలోనే ఆ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు చెప్పారు. ముఖ్యంగా పాఠశాల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడంతో పాటు వారు వృత్తి ధర్మాన్ని విడిచి, రియల్ ఎస్టేట్ లాంటి కార్యక్రమాలపైనే అధికంగా దృష్టి సారిస్తున్నారని, కొందరు ఉపాధ్యాయులు పాఠశాల సమయంలో అసాంఘిక కార్యకలాపాలకు పా ల్పడుతున్నారని పలువురు సభ్యులు అధికారుల దృష్టికి తేగా, అలాంటి వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని అధికారులు సమాధానమిచ్చారు. అధికారులు ప్రొటోకాల్ విషయంలో తమను అవమానపరుస్తున్నారని, స్థానిక ప్రజాప్రతినిధులైనా సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. దీంతో భవిష్యత్‌లో అలాంటివి జరుగకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సమాధానమిచ్చారు.
విద్య, వైద్య వ్యవస్థలో బయోమెట్రిక్ విధానాన్ని తీసుకురావాలి..
వైద్యశాఖలో జరుగుతున్న ప్రగతిని జిల్లా వైద్యాధికారి వివరిస్తున్న క్రమం లో ఓ సభ్యుడు తమ మండలంలోని పీహెచ్సీలో వైద్యులు సమయానికి రాకపోగా, ఎప్పు డూ అందుబాటులో ఉండడం లేదని సభ దృష్టికి తెచ్చారు. దీంతో సభలో ఉన్న ఎమ్మెల్యే రఘునందన్‌రా వు జోక్యం చేసుకొని, వైద్యులు పీహెచ్‌సీల్లో సమయ పాల న పాటించడం లేదని, ఇదే సమస్య విద్యా వ్యవస్థలోనూ ఉందన్నారు. వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయులు, పీహెచ్‌సీల్లో పని చేసే వైద్యులకు బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చి, హాజరు తీసుకోవాలని ఎ మ్మెల్యే చెప్పారు. ప్రభుత్వం పేదలకు విద్య, వైద్యం అందించాలని ప్రయ త్నం చేస్తుంటే, అధికారులు ఆ దిశగా వెళ్లడం లేదన్నారు. ప్రతి పాఠశాల, పీహెచ్సీలో ఉదయం 10గంటలకు, మధ్యాహ్నం 2కు, సాయంత్రం 6 గంటలకు ఇలా మూడు సార్లు బయోమెట్రిక్ ద్వారా హాజరు ఇచ్చేలా బయోమెట్రిక్ యంత్రాలను అందుబాటులోకి తేవాలన్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాలని ఎమ్మెల్యే రఘునందన్‌రావు కోరగా, వెంటనే జడ్పీ చైర్పర్సన్, కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రతిపాదించిన విధంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ దవాఖానల్లో బయోమెట్రిక్ విధానాన్ని తెచ్చేలా ప్రభుత్వానికి నివేదిస్తామని సభకు తెలిపారు. ఇందుకు సబంధించిన ప్రతిపాదనలను జిల్లా వైద్యశాఖ, విద్యాశాఖ అధికారులు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ప్రతిపాదనకు సభలో ఉన్న సభ్యులు ఆమోదం తెలిపారు.