సంగారెడ్డి, మే 30(నమస్తే తెలంగాణ): విత్తనాల కొరత రైతులను కలవరపెడుతున్నది. వానకాలం సీజన్ ప్రారంభానికి ముందే జిల్లాలో విత్తనాల కొరత ప్రారంభమైంది. విత్తనాల కోసం రైతులు పట్టాదారు పాసుపుస్తకాలను వరుసలో పెడుతున్నారు. ఇటీవల జోగిపేటలో రైతులు జీలుగ విత్తనాల కోసం క్యూలో పట్టాదారు పాస్‌పుస్తకాలు పెట్టడంతో పాటు ధర్నాకు దిగారు. మంగళవారం పుల్క ల్, చౌటకూరు మండల కేంద్రాల్లో రైతులు జీలుగ విత్తనాల కోసం బారులు తీరారు. మెదక్ జిల్లా తూప్రాన్, వెల్దుర్తి తదితర మండలాల్లోనూ రైతులు చెప్పులు క్యూలో పెట్టి నిరీక్షించారు. విత్తనాలు అందించాలని రాస్తారోకోలు చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి, దుబ్బాకలో కూడా ఇటీవల రైతులు జీలుగ విత్తనాల కోసం క్యూకట్టారు. సరిపడా విత్తనాలు లభించక పోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
వ్యవసాయ అధికారులు టోకెన్లు జారీ చేయడం, విత్తనాలు అందజేయడంలో తీవ్ర జాప్యం చేస్తుండడంతో రైతులు వరుసలో నిలబడలేక పట్టాదారు పాసుపుస్తకాలను క్యూలో పెడుతున్నారు. గంటల తరబడి ఆగ్రోస్ సేవా కేంద్రాల వద్ద వేచి చూసే పరిస్థితులు ఉన్నా యి. కొరత కారణంగా రైతులకు సకాలంలో జీలుగ విత్తనాలు అందడం లేదు. విత్తనాల కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న వ్యవసాయశాఖ అధికారుల పనితీరుపైనా రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్యూలో పట్టాదారు పాసుపుస్తకాలు ఉంచి గంటల తరబడి వేచిచూస్తు న్నా అధికారులు వేగంగా స్పందించి విత్తనాలు ఇవ్వడం లేదని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిథ్యం వహిస్తున్న అందోల్ నియోజకవర్గంలోనూ రైతులు విత్తనాల కొరతను ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి విత్తన కష్టాలను తొలిగించాలని రైతులు కోరుతున్నారు.
వానకాలం సీజన్ ప్రారంభానికి ముందే జిల్లాలో రైతులకు విత్తన కొరత వేధిస్తున్నది. వానకాలం సాగుకు రైతులు భూములను సారవంతం చేసేందుకు పొలాల్లో జీలుగ, జనుము సాగుచేసి దున్నుతారు. ఇలా చేయడం ద్వారా చౌడు, ఇతర నేల భూములు సారవంతమవుతాయి. జిల్లాలో వరి సాగుచేసే రైతులతో పాటు వానకాలం సీజన్లో ఇతర పంటలు సాగుచేసే రైతులు జనుము, జీలుగ వేస్తారు. ఇటీవల అకాల వర్షాలు కురవడంతో రైతులు జనుము, జీలుగ మొదలుపెట్టారు. అయితే జనుము, జీలుగ విత్తనాల కొరత ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వానకాలం సీజన్ ప్రారంభమయ్యేందుకు ఇంకా రెండువారాల సమయం ఉంది. అంతలోగా జనుము, జీలుగ సాగు, దున్నటం పూర్తికావాలి.
రైతులకు అవసరమైన జీలుగ విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో ఆందోళనకు దిగుతున్నారు. సంగారెడ్డి జిల్లాకు 5881 క్వింటాళ్ల జనుము, జీలుగ విత్తనాలు అవసరం. 1981 క్వింటాళ్ల జనుము విత్తనాలు అవసరం కాగా, ఇప్పటి వరకు 1300 క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేశారు. జీలుగ విత్తనాలు 3900 క్వింటాళ్లు అవసరం కాగా, ఇప్పటి వరకు 1800 క్వింటాళ్లు వ్యవసాయశాఖ సరఫరా చేసింది. ఇంకా 2100 క్వింటాళ్ల విత్తనాలు సరఫరా కావాల్సి ఉంది. ఇంకా 2100 క్వింటాళ్ల విత్తనాలు జిల్లాకు రాలేదు. రైతులకు అవసరమైన మేర జీలుగ విత్తనాలను సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో రైతులు పట్టాదారు పాసుపుస్తకాలను క్యూలో పెట్టడంతో పాటు ధర్నాలకు దిగుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభు త్వం, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని రైతులు విమర్శిస్తున్నారు.
వానకాలం సీజన్ ప్రారంభానికి ముందే జీలుగ విత్తనాల కొరతతో ఇబ్బందులు పడుతుంటే, సీజన్ ప్రారంభమయ్యాక ప్రధాన పంటలైన వరి, పత్తి, కందులు, మొక్కజొన్న, జొన్న విత్తనాల కొరత తప్పదా అన్న ఆందోళన రైతుల్లో నెలకొన్నది. వానకాలంలో సంగారెడ్డి జిల్లాలో 7,24,405 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. జిల్లాలో 3.60 లక్షల ఎకరాల్లో పత్తి, 1.50 లక్షల ఎకరాల్లో వరి, 80వేల ఎకరాల్లో కంది, 15వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగుకానున్నాయి.
అధికారుల సమాచారం మేరకు వానకాలం సీజన్లో వరి, కంది, మొక్కజొన్న, సోయాచిక్కుడు, పెసలు, మినుములు, జొన్న విత్తనాల 54,944 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. 4.50 లక్షల ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరం. సంగారెడ్డి జిల్లాలోని 450 ప్రైవేటు సీడ్ డీలర్ల ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలను వ్యవసాయశాఖ అందుబాటులో ఉంచుతున్నది. ఓవైపు విత్తనాల కొరత, మరోవైపు నకిలీ విత్తనాల బెడద రైతులను వేధిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, విత్తనాల కొరతపై స్పందించక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలకు సరిపడా జీలుగ విత్తనాలు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయా జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.