అతను రాష్ర్టానికే తలమానికమైన సచివాలయంలో ఒక ఉద్యోగి. మంచి వేతనం. కానీ, వీటితో ఆయన తృప్తి పడలేదు. మరింత సంపాదనకు ఆశపడి షేర్మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. చీటీలు నడిపాడు. కానీ, కొవిడ్, ఉక్రెయిన్ యుద్ధ్దం కారణంగా ఆర్థికంగా బాగా నష్టపోయాడు. ఆర్థిక సుడిగుండం నుంచి బయట పడడానికి తన పేరిట భారీగా బీమా చేయించి తాను చనిపోయినట్టు నమ్మించి పరిహారం పొందాలని ప్లాన్ రచించాడు. కుటుంబీకులు సహకరించడంతో ప్లాన్ అమలు చేశాడు. కానీ, పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడడంతో ప్లాన్ వికటించి జైలు పాలయ్యాడు. ఈ ఘటనలో మెదక్ జిల్లా టేక్మాల్ మండలం భద్యా తండాకు చెందిన పాత్లోత్ ధర్మానాయక్‌తో పాటు అతని భార్య, కుమారుడు, అక్క, అల్లుడు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు.
మెదక్ అర్బన్, జనవరి 18 : ఈ నెల 9న మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపూర్ గ్రామం బీమ్లాతండా వద్ద కారుతో సహా వ్యక్తి సజీవ దహనమైన ఘటన కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం మెదక్ జిల్లాకేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్లో జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం భద్యా తండాకు చెందిన పాత్లోత్ ధర్మానాయక్ హైదరాబాద్‌లోని సచివాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను కూకట్‌పల్లిలోని బాలాజీనగర్‌లో ఉంటున్నాడు. ఇతను 2018 నుంచి పలు రకాల స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులతో పాటు ఆన్లైన్ ట్రేడింగ్ చేసి బాగా సంపాదించాడు. కానీ, కొవిడ్, ఉక్రెయిన్ యుద్ధ్దం కారణంగా బాగా నష్టపోయాడు. అనంతరం చీటీలు ప్రారంభించి అందులో వచ్చిన డబ్బులను సైతం స్టాక్ మార్కెట్, ఆన్లైన్ ట్రెడింగ్లో పెట్టి సుమారు రూ.85 లక్షల వరకు నష్టపోయాడు. దీంతో అతనికి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఎలాగైనా అప్పుల నుంచి విముక్తి కావాలని ధర్మానాయక్ తన భార్య నీలా, అక్క సునంద, అల్లుడు శ్రీనివాస్‌తోపాటు మైనర్ కొడుకుతో కలిసి చర్చించి పథకం పన్నాడు. అందరూ కలిసి మరోవ్యక్తిని చంపి ధర్మానాయక్ చనిపోయినట్లు నిరూపించి బీమా పరిహారం డబ్బులు పొందాలని ప్లాన్ వేశారు. దీనికోసం ఏడాది కాలంగా ధర్మానాయక్ రూ.7.40 కోట్ల విలువైన సుమారు 25 పాలసీలు తీసుకున్నాడు.
ప్లాన్ కోసం తన పోలికతో ఉన్న మరోవ్యక్తి కోసం వెతక సాగాడు. దీనికోసం నిత్యం సచివాలయంలో ఉద్యోగం ముగించుకుని నాంపల్లి మెట్రో రైల్వేస్టేషన్ వద్దకు వెళ్లేవాడు. ఈ క్రమంలో తన పోలికలతో ఉన్న అంజయ్య అనే వ్యక్తిని పట్టుకున్నాడు. నిజామాబాద్‌లో తన మామిడి తోటలో పని ఉన్నదని అతనికి చెప్పాడు. ఈ నెల 7న ధర్మానాయక్, అతని అల్లుడు శ్రీనివాస్ కలిసి అంజయ్యను మెట్రో రైల్వేస్టేషన్లో ఎక్కించుకొని నిజామాబాద్ తీసుకువెళ్లారు. అనంతరం అంజయ్య మద్యం సేవించడంతో బీమా కంపెనీలు మద్యం సేవించి చనిపోయిన వ్యక్తులకు పరిహారం ఇవ్వరని తెలుసుకుని వారు పథకం వాయిదా వేసుకున్నారు. దీంతో దగ్గరలోని బార్లో ధర్మానాయక్, శ్రీనివాస్ మద్యం తాగి లాడ్జ్‌కు వచ్చారు. అక్కడే ఉన్న అంజయ్యను బయటికి వెళ్లి భోజనం చేసి తిరిగి మళ్లీ లాడ్జ్‌కు రమ్మని చెప్పారు. కానీ, అంజయ్య అక్కడి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో వారి ప్లాన్ బెడిసికొట్టింది. ఎలాగైనా మరోవ్యక్తితో అయినా పథకం అమలు చేయాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్‌లోని లేబర్ అడ్డా నుంచి బాబు (45) అనే మరో వ్యక్తిని టీఎస్ 15 ఈఎఫ్ 0236 కారులో మెదక్ జిల్లా టేక్మాల్ మం డలం బీమ్లానాయక్ తండాకు తీసుకువచ్చారు. అక్కడ కారులో ముందు కూర్చోమని చెప్పడంతో బాబు నిరాకరించాడు. దీంతో కారులోనే అడ్డాకూలీ బాబును గొడ్డలితో నరికి, కర్రలతో కొట్టి చంపారు.
అనంతరం బాబు మృతదేహాన్ని డ్రైవింగ్ సీటులో కూర్చోబెట్టి పెట్రోలు పోసి కాల్చారు. కారుతో సహా బాబు సజీవ దహనం అయ్యేలా పని పూర్తిచేశారు. అక్కడి నుంచి ఇద్దరు నిందితులు పెద్దశంకరంపేట మీదుగా నిజామాబాద్‌కు వెళ్లారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులకు చనిపోయిన వ్యక్తి కుటుంబీకుల వ్యవహార శైలిపై అనూమానం వచ్చింది. అసలు చనిపోయింది ధర్మానాయకేనా అనే అనూమానంతో దర్యాప్తు ప్రారంభించారు. వారికి కొన్ని టెక్నికల్ ఆధారాల ద్వారా ధర్మానాయక్ బతికి ఉన్నాడని తెలుసుకున్నారు. నిజామాబాద్ నుంచి ధర్మానాయక్, శ్రీనివాస్ ఎల్లారెడ్డి, గోపాల్పేట్, హవేళీఘనపూర్ మీదుగా ఈ నెల 17న మెదక్ వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు నిందితులపై 302, 364, 120, 201, 202, 212 రెడ్‌విత్ 34 ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మీడియాకు తెలిపారు. మెదక్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఒక బృందం, అల్లాదుర్గం సీఐ ఆధ్వర్యంలో మరో బృందం నిందితులను గుర్తించి కేసు ను వేగంగా ఛేదించడంతో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అభినందించారు. జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి, మెదక్ డీఎస్పీ సైదులు, అల్లాదుర్గం సీఐ, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.