మునిపల్లి, సెప్టెంబర్ 30: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుధేరా, ఖమ్మంపల్లి, బోడపల్లి, పెద్దలోడి గ్రామాల్లో సర్పంచ్ స్థానం ఎస్సీలకు అందని ద్రాక్షగా మారింది. ఈ గ్రామాలకు ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించక పోవడంతో దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునిపల్లి మండలంలో వచ్చిన గ్రామాల్లోనే డబుల్..డబుల్ ఎస్సీ రిజర్వేషన్ వచ్చినప్పటికీ ఒక్కసారి మా గ్రామాలకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పించకపోవడంపై సంబంధిత అధికారుల తీరుపై బుధేరా, ఖమ్మంపల్లి, బోడపల్లి, పెద్దలోడి గ్రామాల దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెద్దలోడి జీపీకి 2001లో జనరల్, 2006లో బీసీ జనరల్, 2013లో బీసీ మహిళ, 2019లో బీసీ మహిళ, 2025లో జనరల్‌కు సర్పంచ్ స్థానం రిజర్వ్ అయ్యింది.బోడపల్లిలో 2001లో బీసీ జనరల్, 2006లో బీసీ మహిళ, 2013లో బీసీ మహిళ, 2019లో బసీ మహిళ, 2025లో జనరల్‌కు సర్పంచ్ స్థానం రిజర్వేషన్ కేటాయించారు. బుదేరాలో 2001లో జనరల్, 2006లో బీసీ జనరల్, 2013లో బీసీ జనరల్, 2019లో బీసీ మహిళ, 2025లో బీసీ మహిళకు సర్పంచ్ స్థానం రిజర్వేషన్ ఖరారు అయ్యింది.
మా గ్రామం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కసారి కూడా సర్పంచ్ స్థానం ఎస్సీ రిజర్వేషన్ కల్పించలేదు. రాజకీయాల్లో ముందుకు రావాలని మాకు ఉంది. గ్రామంలో ఒక్కసారైనా దళితులకు అనుకూలమైన రిజర్వేషన్ రాకపోవడంతో రాజకీయం అంటేనే నిరాశకు గురవుతున్నాం. అధికారులు స్పందించి న్యాయం చేయాలి.
– తుడుం సుభాశ్, ఖమ్మంపల్లి
గ్రామంలో రాజకీయం చేయడం అంటే నాకు చాలా ఇష్టం. మా గ్రామంలో సర్పంచ్‌కు పోటీచేయాలంటే రిజర్వేషన్ అనుకూలంగా రావడం లేదు. రాజకీయాల్లో ఎంత చురుగ్గా ఉన్నా రిజర్వేషన్ లేకపోవడంతో రాజకీయాల నుంచి తప్పుకోవాలి అనిపిస్తుంది. ఏదో ఒకరోజు ఎస్సీ రిజర్వేషన్ రాకపోతుందా, ఎన్నికల్లో పోటీ చేయకపోతనా అని ఎదురుచూ స్తున్న ప్రతిసారి నిరాశే మిగులుతుంది.
– గడ్డం రాజు, బుధేరా