
ఆ ఇద్దరు నేతలు గురుశిష్యులు. సంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో ఇద్దరికీ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇద్దరు సామాన్య రైతు కుటుంబాల నుంచి వచ్చి రాజకీయాల్లో ఎదిగినవారు. ఒకరు వరుసగా సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఐదుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా పనిచేసి రాష్ట్ర రాజకీయాల్లో విశిష్టమైన పేరు గడించిన పట్లోళ్ల రామచంద్రారెడ్డి. మరొకరు పట్లోళ్ల రామచంద్రారెడ్డిని రాజకీయ గురువుగా భావించి రాజకీయాల్లో ఎదిగిన వ్యక్తి వెన్నవరం భూపాల్‌రెడ్డి. గురువు రామచంద్రారెడ్డికి శాసనసభ స్పీకర్‌గా పనిచేసి గౌరవం దక్కగా, ఆయన శిష్యుడైన వి.భూపాల్‌రెడ్డికి శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్ హోదాలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న మండలి సమావేశాలకు అధ్యక్షత వహించే అవకాశం లభించింది. శాసనమండలి చరిత్రలో ప్రొటెమ్ చైర్మన్ హోదాలో శాసనమండలి సమావేశాలను నడపనున్న అరుదైన ఘనత భూపాల్‌రెడ్డికి దక్కింది.
సంగారెడ్డి, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వెన్నవరం భూపాల్‌రెడ్డికి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా అవకాశం కల్పించారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతివిద్యాసాగర్రావు పదవీ కాలం జూన్‌లో ముగిసింది. దీంతో శాసనమండలి చైర్మన్ స్థానం ఖాళీ అయ్యింది. చైర్మన్ ఎన్నికయ్యేంత వరకు ప్రొటెం చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉండడంతో సీఎం కేసీఆర్ ప్రొటెం చైర్మన్‌గా సంగారెడ్డి జిల్లాకు చెందిన వెన్నవరం భూపాల్‌రెడ్డిని ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రొటెం చైర్మన్‌గా వి.భూపాల్‌రెడ్డి పేరును ప్రతిపాదించంతో గవర్నర్ తమిళిసై రంగరాజన్ జూన్ 4న ప్రొటెం చైర్మన్‌గా వెన్నవరం భూపాల్‌రెడ్డి నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలి నూతన చైర్మన్‌ను ఎన్నుకునే వరకు ఆయన ప్రొటెమ్ చైర్మన్‌గా కొనసాగనున్నారు. కాగా, శుక్రవారం నుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం శాసన మండలి ప్రొటెం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న వెన్నవరం భూపాల్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నుంచి శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. అక్టోబర్ 1వ తేదీ వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నది. శాసనమండలి ప్రొటెం చైర్మన్ హోదాలో సభను నడిపే అరుదైన అవకాశం ఆయనకు దక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి ప్రొటెం చైర్మన్ హోదాలో శాసనమండలి సమావేశాలను నిర్వహించలేదు. నూతనంగా శాసనమండలి ఏర్పాటు లేదా పునరుద్ధ్దరణ తర్వాత సభ్యులతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించేందుకు ప్రొటెమ్ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. సభ్యులతో ప్రమాణస్వీకారం పూర్తయిన అనంతరం శాసనమండలి నూతన చైర్మన్, డిప్యూటీ చైర్మన్లను ఎన్నుకుంటారు. చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్ ఆధ్వర్యంలో శాసన మండలి సమావేశాలను నిర్వహిస్తారు. కాగా, తెలంగాణ శాసనమండలిలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేమారు మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవీకాలాలు పూర్తయ్యాయి. దీంతో ప్రొటెం చైర్మన్‌గా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురానికి చెందిన వి.భూపాల్‌రెడ్డి నియమితులయ్యారు. ఆయన అధ్యక్షతన ప్రస్తుతం శాసనమండలి సమావేశాలు జరుగనుండడం అరుదైన అంశంగా చెప్పవచ్చు.
ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్‌గా పనిచేసిన రామచంద్రారెడ్డి
దివంగత పట్లోళ్ల రామచంద్రారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి న్యాయవాదిగా పనిచేశారు. 1962లో తొలిసారిగా సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాం గ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఐదు పర్యాయాలు ఆయన గెలుపొందారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కేబినెట్లో భారీ పరిశ్రమలశాఖ మంత్రిగా పనిచేశారు. 1990 జనవరి 4 నుంచి డిసెంబర్ 22 వరకు ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. 1999లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆయన , 2004లో మెదక్ ఎంపీ గా పోటీచేసి ఓడిపోయారు. 28 ఏప్రిల్, 2018 లో కన్నుమూశారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం భూపాల్‌రెడ్డి సొంతం
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో మే 1, 1947న జన్మించిన వెన్నవరం భూపాల్‌రెడ్డికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. విద్యాభ్యాసం పూర్తయిన అనంతరం ఇందిరాగాంధీ స్ఫూర్తితో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1967లో కాంగ్రెస్ పార్టీలో చేరిన భూపాల్‌రెడ్డి అంచలంచెలుగా ఎదిగారు. అప్పటి సంగారెడ్డి ఎమ్మెల్యే పి.రామచంద్రారెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశీస్సులతో కాంగ్రెస్‌లో వివిధ పదవులను నిర్వహించారు. 1975 నుంచి 1978 వరకు ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు.1987లో రామచంద్రాపురం ఎంపీపీగా ఎన్నికయ్యారు. 2007, 2009లో ఎమ్మెల్సీగా పనిచేస్తూ 2015 వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో భూపాల్‌రెడ్డి 2014 జూలై 25న కాంగ్రెస్ పార్టీని వీడి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. 2015లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు రాగా వి.భూపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వరుసగా మూడుమార్లు హ్యాట్రిక్ విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లాలో పార్టీలకతీతంగా అందరూ భూపాల్‌రెడ్డిని అభిమానిస్తారు. ఎమ్మెల్సీగా జిల్లా ప్రజలకు సేవలందిస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆయన ముందుంటున్నారు. రామచంద్రాపురంలో రూ.2 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం నిర్మించారు. ఆ కళాశాలకు వి.గీతాభూపాల్‌రెడ్డి కళాశాలగా నామకరణం చేశారు. పేదలకు ఆర్థిక సహాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు.