ఝరాసంగం, ఆగస్టు 27: సంగమేశ్వరా దేవాలయం శివ నామస్మరణంతో మర్మోగింది. శనివారం ఆరాధ్యదైవం సంగమేశ్వరున్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మండల కేంద్రం ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మాసం ముగింపు, అమావాస్య రావడంతో భక్తులు తెల్లవారు జాము నుంచి తరలివచ్చారు.
దేవాలయంలోని గర్భగుడిలో ఉన్న పార్వతీ సమేత సంగమేశ్వరుడికి రుద్రాభిషేకం, క్షీరాభిషేకం, ఆకు పూజ, కుంకుమార్చన, అన్నపూజ చేశారు. కొంతమంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. భక్తుల ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలను ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తీసుకున్నారు. పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు బజ్జీల సంగప్ప కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు.