సిద్దిపేట, జూన్ 13: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, సిద్దిపేట తొలి ఎమ్మెల్యే ఎడ్ల గురువారెడ్డి చేసిన సేవలు మరువలేనివని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి అన్నారు. శనివారం గురువారెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలోని విక్టరీ చౌరస్తా వద్ద ఉన్న ఆయన విగ్రహానికి భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఎడ్ల గురువారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం నందిని సిధారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో కామ్రేడ్ ఎడ్ల గురువారెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ సాయుధ పోరాటంలో ఆయన ధైర్యసాహసాలతో పాల్గొని ప్రజల హకుల కోసం అంకితభావంతో పనిచేశారని గుర్తుచేశారు. ప్రజల సమస్యల పరిషారమే లక్ష్యంగా రాజకీయ జీవితాన్ని కొనసాగించిన ఆయన సిద్దిపేటకు తొలి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారని గుర్తు చేశారు. నేటి తరానికి ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని, తెలంగాణ చరిత్రలో ఆయన చేసిన త్యాగాలు, పోరాట స్ఫూర్తి, ప్రజా సేవలను యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అందుకోసం ఆయన జీవిత చరిత్రను రాష్ట్ర పాఠ్యపుస్తకంలో చేర్చి విద్యార్థులకు పరిచయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేరుగు రాజనర్సు మాట్లాడుతూ గురువారెడ్డి తొలి ఎమ్మెల్యేగా సిద్దిపేట అభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ మాట్లాడుతూ ఎడ్ల గురువారెడ్డి కమ్యునిస్టు ఉద్యమానికి, రైతాంగ పోరాటానికి చేసిన సేవలు అపారమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పాపయ్య, సీనియర్ పాత్రికేయుడు అంజ య్య, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రంగాచారి, సీపీఐ సీనియర్ నాయకులు ఎడ్ల వెంకటరామిరెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కిష్టపురం లక్ష్మణ్, సీపీఐ నాయకులు గజాబీమకర్ బన్సీలాల్, హరీఫ్, చంద్రం, మల్లేశం, భిక్షపతి పాల్గొన్నారు.