సదాశివపేట, అక్టోబర్ 13: ఉమ్మడి రాష్ట్ర పాలనలో అభివృద్ధికి నోచుకోని సదాశివపేట మున్సిపాలిటీ నేడు బీఆర్ఎస్ సర్కారు హయాంలో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సదాశివపేట మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు ప్రత్యేక నిధులు మంజూరు చేసి రూపురేఖలు మార్చారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. దీంతో సదాశివపేట మున్సిపాలిటీ అన్ని రంగాల్లో ముందువరుసలో ఉంది. పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులతో పాటు వివిధ అభివృద్ధి పనులు చకచకా కొనసాగుతున్నాయి. సదాశివపేట పట్టణానికి నయాలుక్ రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నారాయణఖేడ్ సభలో సీఎం కేసీఆర్ సదాశివపేట మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు మంజూరు చేశారు. రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ కృషితో ఈ నిధులు త్వరగా విడుదలయ్యాయి. రూ.20 కోట్లు సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ, ఓపెన్ డ్రైనేజీలకు కేటాయించగా, ఇప్పటి వరకు రూ.10 కోట్ల పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. మున్సిపాలిటీలో 12 కిలోమీటర్లు సీసీ రోడ్లు, 2.5 కిలోమీటర్లు సీసీ డ్రెయిన్స్, 800 మీటర్లు అండర్ డ్రైనేజీల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగతా వార్డుల్లో పనులు కొనసాగుతున్నాయి. సీసీ రోడ్ల నిర్మాణంతో ప్రయాణ ఇబ్బందులు తొలిగిపోయాయని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉన్నాయి. ఆయా వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వల పనులు కొనసాగుతున్నాయి. కొన్ని వార్డుల్లో పనులు పూర్తికాగా, 5, 7 వార్డుల్లో 70 శాతం పూర్తయ్యాయి. త్వరలో అన్ని వార్డుల్లో పనులు పూర్తికానున్నాయి.
సీఎం కేసీఆర్ మంజూరు చేసిన ప్రత్యేక నిధులతో సదాశివపేట రూపురేఖలు మారిపోయాయి. రూ. 25 కోట్ల నిధులతో ఎంతో అభివృద్ధి జరుగుతున్నది. సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి ప్రజల ఇబ్బందులు తీరుస్తున్నాం. భవిష్యత్తులో సదాశివపేటను అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచుతాం. నిధుల మంజూరుకు కృషి చేసిన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్
చింతా ప్రభాకర్‌కు కృతజ్ఞతలు.
– చింతా గోపాల్, మున్సిపల్ వైస్ చైర్మన్