సంగారెడ్డి/మెదక్ న్యూస్‌నెట్‌వర్క్, ఆగస్టు 1: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంపై మంగళవారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులు, ఇతర సిబ్బంది బస్సు డిపోల వద్ద సందడి చేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలు, ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని, దశాబ్దాల కలను నెరవేర్చారని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తమ గౌరవాన్ని పెంచారన్నారు. ఎమ్మెల్యేలు,ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ ఆర్టీసీ సంస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి ప్రగతి బాటలో నడిపించారని గుర్తుచేశారు. మీకు అన్ని వేళలా అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘టీఎస్ఆర్టీసీ’కి శుభవార్త చెప్పింది. సోమవారం జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకుని, ప్రకటించింది. త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలిపింది. దీంతో టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ కొలువుదారులు కానుండడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న కల సాకారం కానుండడంతో ‘ఆర్టీసీ’ ఆనందంలో మునిగిపోయింది. మంగళవారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ డిపోల ఎదుట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంచుకుని, ఒకరికొకరు తినిపించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చేదోడువాదోడుగా ఉంటూ, రెట్టింపు ఉత్సాహంతో సంస్థను లాభాల బాటలో సాగిస్తామని ముక్తకంఠంతో చెప్పారు.