వెల్దుర్తి, జూన్ 30: మెదక్ జిల్లా వెల్దుర్తి పట్టణంలోని సెంట్రల్ బ్యాంకులో దొంగలు చోరీ కి యత్నించారు. వెల్దుర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలోని సెంట్రల్ బ్యాంకులో ఆదివారం అర్ధరాత్రి దొంగలు సెంట్రల్ బ్యాంకు భవనం వెనుక వైపు నుంచి స్టోర్ రూంలోకి రంధ్రం చేశారు. ఈ రంధ్రం ద్వారా తలుపు పగులగొట్టి బ్యాంకు లోపలికి వెళ్లారు. లాకర్ తెరిచేందుకు యత్నించగా సేస్టీ అలారం మోగడంతో అప్రమత్తమైన దొంగలు వచ్చిన దారి వెంట బయటకు పరుగులు తీశారు.
వెంటనే బ్యాం కు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా మెదక్ జిల్లా తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, సీఐ రంగాకృష్ణ, వెల్దుర్తి ఎస్సై రాజుతో పాటు పోలీసు అధికారులు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. చోరీకి యత్నించిన తీరును పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మెదక్ క్లూస్ టీంకు సమాచారం ఇవ్వగా, ఘటనా స్థలానికి వచ్చిన వారు బ్యాంకులో పలు ఆధారాలు సేకరించారు. బ్యాంకు సిబ్బంది ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసిన వెల్దుర్తి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో సైతం ఇలాగే బ్యాంకు వెనుక వైపు నుంచి కన్నం వేసి చోరీకి యత్నించిన తరహాలోనే ప్రస్తుతం జరగడం గమనార్హం.