నంగునూరు, మార్చి 10: నంగునూరులో స్థాపనాచార్య శిల్పాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ సోమవారం తెలిపారు. జైన సాధువు, పుస్తకం, వ్యాసపీఠం, శిష్యులున్నట్లు చెక్కిన శిల్పాన్ని స్థాపనాచార్య జైన శిల్పం అంటారని తెలిపారు. గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న శిలాస్తంభాన్ని పరిశీలించి, అది జైన శిల్పమని ప్రాథమికంగా గుర్తించామన్నారు.
శిల్పంలో జైనగురువు, అతడికి రెండు వైపుల సేవకులు, కింద వ్యాసపీఠానికి రెండువైపులా బోధన వింటున్న శిష్యులు కనిపిస్తున్నారని తెలిపారు. దీనిని పరిశీలించిన చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఇది 11, 12వ శతాబ్దాలకు చెందిన జైన శిల్పాల్లో అరుదైన స్థాపనాచార్య శిల్పం అని తెలిపారన్నారు. గతంలో లభించిన ఆధారాలతో నంగునూరు పెద్ద జైన కేంద్రంగా ఉండేదని, ప్రస్తుతం లభించిన శిల్పం ఆధారంగా జైన విద్యాకేంద్రంగా వెలుగొందినట్లు తెలుస్తుందన్నారు.