భక్తుల కొంగుబంగారం రేజింతల్ సిద్ధివినాయకుడి జయంతోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. స్వామి వారికి అభిషేకం, గణపతి పూజ, శతచండీ హవనం, మహా మంగళహారతి, తీర్థప్రసాదాల కార్యక్రమాలు భక్తిశ్రద్ధల తో నిర్వహించారు. యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు. తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ దంపతులు ఆలయాన్ని సందర్శించారు.
– న్యాల్కల్, డిసెంబర్ 25
న్యాల్కల్, డిసెంబర్ 25 : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రేజింతల్ సిద్ధివినాయక ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారి జయంతి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైనా ఆదివారం ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, పువ్వులతో అందంగా అలంకరించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్యర్యంలో ఉదయం స్వామివారికి అభిషేకం, గణపతి శతచండీహవనం, మహా మంగళహారతి, తీర్థప్రసాద వితరణ నిర్వహించారు.
అనంతరం యాగశాలలో కమిటీ సభ్యులతో వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ, హద్నూర్ పోలీసుల ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ కమిటీ, పలువురు దాతలు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. తొగుట పీఠాధిపతి మాధవనంద సరస్వతీ, హైదరాబాద్కు చెందిన ఎమ్మెల్సీ బొగ్గారపు దయనంద్ దంపతులు ఆలయాన్ని సందర్శించారు. ఆలయ మర్యాదాలతో పూజారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో అశోక్ రేజింతల్, అల్లాడి నర్సింహులు, సభ్యులు రవికుమార్, కల్వ చంద్రశేఖర్, ఉల్లిగడ్డ బస్వరాజ్, నీల రాజేశ్వర్, చం ద్రయ్య, మేనేజర్ కృష్ణ, భక్తులు పాల్గొన్నారు.