అందోల్/ వట్పల్లి, సెప్టెంబర్ 2: అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శుక్రవారం అందోల్ మండలంలోని అన్నాసాగర్, వట్పల్లి మండలంలోని దేవునూర్, పాలుడ్గు గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన పింఛన్ కార్డులు, పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 8 ఏండ్ల కాలంలో ఎలాంటి పైరవీలకు తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తున్నామన్నారు. గతంలో 60 ఏండ్లు నిండిన వారికి పింఛన్లు ఇచ్చేవారన్నారు. సీఎం కేసీఆర్ ఎంతో ఆలోచించి 57 సంవత్సరాలు నిండిన వారికి కూడా పింఛన్లు అందజేస్తున్నారన్నారు. పింఛన్‌కు అర్హులుగా ఉండి, రానీవారు ఎవరైనా ఉంటే నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అధికారులు అందుకు సహకరించి, అర్హులైన లబ్ధిదారులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వృద్ధాప్యంలో చిన్న చిన్న అవసరాలకు ఇతరులపై ఆధారపడకుండా ప్రభుత్వం పింఛన్లు అందజేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. దీన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఎమ్మెల్యే విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ అన్ని పథకాలకు తామే డబ్బులు చెల్లిస్తున్నామని ప్రగాల్భాలు పలుకుతున్నదని, వారు చెప్పేది నిజమైతే వారు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఈ పథకాలు ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు మాట్లాడే మాటలకు, పనులకు పొంతన ఉండదని, వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీలు బాలయ్య, కృష్ణవేణి, పార్టీ మండలాధ్యక్షుడు లక్ష్మీకాంత్‌రెడ్డి, వరం చైర్మన్ వీరారెడ్డి, ఎంపీడీవోలు సత్యనారాయణ, జగదీశ్వర్, ఎంపీవో యూసూఫ్, ఎంపీటీసీ నర్సింహులు, పీఏసీఎస్ చైర్మన్ వినోద్‌గౌడ్, వైస్ చైర్మన్ శ్రీశైలం నాయకులు పాల్గొన్నారు.

చౌటకూరు సమావేశంలో మాట్లాడుతున్న అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శం
చౌటకూర్, సెప్టెంబర్2: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. నిరుపేదలకు ఆసరా పథకం ఆదుకుంటున్నదనిన్నారు. మండలంలోని శివంపేట గ్రామానికి చెందిన 68 మంది లబ్ధిదారులకు ఆసరా పత్రాలు, కార్డులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్ల పథకాలతో నిరుపేదల కళ్లల్లో ఆనందం కలిగిస్తున్నారన్నారు. ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, వితం తు పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు గాజుల వీరేందర్, మండల కో ఆప్షన్ సభ్యుడు అలీం, ఎంపీడీవో మధులత, ఆత్మ కమిటీ చైర్మన్ యాదగిరిరెడ్డి, సీడీసీ డైరెక్టర్ జైపాల్‌నాయక్, చౌటకూర్, పుల్కల్ మండలాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శివకుమార్, విజయ్ కుమార్, కార్యదర్శి శ్రీహరి, ఆర్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ పట్లోళ్ల నర్సింహరెడ్డి, జిల్లా కమిటీ సభ్యురాలు పుష్పలతా నగేశ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కిష్టారెడ్డి, సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ నత్తి దశరథ్, ఎంపీటీసీలు కిరణ్ గౌడ్, మాణిక్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.